100కు స్వస్తి..112కు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

100కు స్వస్తి..112కు శ్రీకారం

Aug 6 2026 8:02 AM | Updated on Aug 6 2026 8:02 AM

అత్యవసర సేవలన్నీ ఇకమీదట 112 నంబర్‌కే

పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్‌, విపత్తు నివారణలకు డయల్‌ 112

పెద్దశంకరంపేట(మెదక్‌): రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సేవలన్నీ ఇక ఒకే గొడుగు కిందికి వచ్చాయి. నూతనంగా 112 డయల్‌ నంబర్‌ను ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది. ఈ నంబర్‌కు డయల్‌ చేసి అత్యవసర సేవలను పొందే అవకాశముంది. గతంలో అత్యవసర సమయాల్లో డయల్‌ 100కు కాల్‌ చేసే వారు. పోలీస్‌(100), అగ్నిమాపక సేవలు(101), అంబులెన్స్‌ (108), మహిళల భద్రత(181), బాలల సంరక్షణకు (1098), విపత్తు నిర్వహణకు (1077) సేవలను ప్రజలు సంప్రదించేవారు. ఇక వీటన్నింటిని అనుసంధానిస్తూ కేవలం ఒకే 112 నంబర్‌ను ప్రారంభించారు.

అత్యవసర సమయానికి

112 డయల్‌ చేయాలి

జిల్లాలో 21 మండలాల పరిధిలో పోలీస్‌స్టేషన్లు, మెదక్‌, నర్సాపూర్‌,పెద్దశంకరంపేట, రామాయంపేట తదితర ప్రాంతాల్లో అగ్నిమాపక కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. బాధితులు పోలీస్‌,అగ్నిమాపక, అంబులెన్స్‌ సేవలను వినియోగించుకోవడానికి ఈ 112నంబర్‌కు డయల్‌ చేస్తే జీపీఎస్‌ ద్వారా ట్రాక్‌ చేసి నేరుగా అత్యవసర సేవలను అందిస్తారు. ఇందులో సుమారు 18 రకాల సేవలను అందించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వన్‌ నేషన్‌–వన్‌ ఎమర్జెన్సీ నంబర్‌ అనే భావనతో రూపొందించిన ఏకీకృత సర్వీసును డీజీపీ సీ.వీ.ఆనంద్‌ ప్రారంభించారు. గతంలో ప్రజలు పోలీసు, అంబులెన్స్‌, అగ్నిమాపకం, విపత్తు నిర్వహణ, మహిళల రక్షణ వంటి అత్యవసర సేవలు వివిధ నంబర్లకు డయల్‌ చేసేవారు. దీనివల్ల ప్రజలకు నంబర్ల విషయంలో అయోమయంగా ఉండేది. దీని స్థానంలో ప్రజలకు ఒకే నంబర్‌ ద్వారా అత్యవసర సేవలు అందుబాటులోనికి వచ్చాయి. రోడ్డు ప్రమాదాలు, గొడవలు, దోపిడీలు వేధింపులు, ప్రమాదకర సమయాల్లో ఈ నంబర్‌కు బాధితులు కాల్‌ చేస్తే తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా అత్యాధునిక కాల్‌ మానిటరింగ్‌ సిస్టంతో అనుసంధానం చేసి వారి లోకేషన్‌ ఆధారంగా అత్యవసర బృందాలకు సమాచారం అందిస్తారు. దీనివల్ల ప్రజలకు అత్యవసర సేవలు అందుబాటులోనికి రావడంతోపాటు సమయం ఆదా అవుతుంది. ఇప్పటికే పోలీస్‌ అధికారులు సోషల్‌మీడియా ద్వారా డయల్‌ 112 ప్రాముఖ్యతపై విస్తృత ప్రచారం చేపడుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement