అల్లాదుర్గం(మెదక్): ప్రైవేట్ స్కూల్ బస్సులు ఫిట్‌నెస్ లేకుండా నడుపుతున్నా అధికారులు పోలీసులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బస్సు నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన అల్లాదుర్గం మండలం చిల్వెర గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి ప్రైవేట్ స్కూల్ బస్సులు చిల్వెర గ్రామం వరకు నడుపుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు. స్కూల్ బస్సు టైర్ పగలడంతో బస్సు అధ్వానంగా ఉందనే విషయం గమనించినట్లు చెప్పారు. బస్సు టైర్లు అరిగిపోయి ఉన్నాయని బస్సు డోర్, కిటికీలు పగిలిపోయినట్లు తెలిపారు. ఇదే విషయాన్ని స్కూల్ యాజమాన్యాన్ని ఫోన్‌లో ప్రశ్నిస్తే ప్రమాదమేమైనా జరిగిందా అని తమపై కోపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ బస్సులపై ఆర్టీఓ, పోలీస్ అధికారులు నిఘా పెట్టి, ప్రమాదం జరగక ముందే చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
నిరసనకు దిగిన విద్యార్థుల తల్లిదండ్రులు


