వన్యప్రాణుల దాహం కేక | - | Sakshi
Sakshi News home page

వన్యప్రాణుల దాహం కేక

Apr 12 2026 6:41 AM | Updated on Apr 12 2026 6:41 AM

ఎండలు మండుతుండటంతో తాగు నీటి కోసం వన్యప్రాణులు అలమటిస్తున్నాయి. అడవిలో గతంలో నిర్మించిన సాసర్‌పిట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దాహంతో జంతువులు గ్రామాల శివారులో ఉన్న పంట చేల వద్దకు వస్తూ ప్రమాదాల బారిన పడే అవకాశాలున్నాయి. అరణ్యంలో కొత్తగా బోర్లు తవ్వించి సోలార్‌ మోటార్లు బిగిస్తే కొంతమేర ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.

– రామాయంపేట(మెదక్‌)

కుంటలో అడుగంటిన నీరు

ఖాళీగా దర్శనమిస్తున్న సాసర్‌పిట్లు

ఇప్పటివరకు విడుదల కాని నిధులు

జిల్లాలో 58 వేలకుపైగా హెక్టార్లలో అటవీ

జిల్లా పరిధిలో 58 వేలకు పైగా హెక్టార్లలో అటవీప్రాంతం విస్తరించి ఉంది. జంతువులకు తాగునీటి సదుపాయం కల్పించడానికి అడవిలో 520కి పైగా సాసర్‌పిట్లు, చెక్‌డ్యాంలు, కుంటలు ఉన్నాయి. ఏటా వేసవి ప్రారంభంలోనే ఆశాఖ అధికారులు సాసర్‌పిట్లు, కుంటల్లో నీరు నింపేవారు. దీంతో వన్యప్రాణులు అడవి దాటి బయటకు రాకుండానే దాహార్తి తీర్చుకునేవి. కాగా ఐదేళ్లుగా ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో అధికారులు నిస్సహాయ స్థితిలో పడిపోయారు. దీంతో కొందరు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సొంత డబ్బులతో అక్కడక్కడ సాసర్‌పిట్లలో నీరు పోయిస్తున్నా, పెద్దగా ఫలితం ఉండటం లేదు.

పనిచేయని సోలార్‌ మోటార్లు

సాసర్‌పిట్లు నిరుపయోగంగా మారి చెత్తాచెదారంతో నిండిపోయాయి. ప్రస్తుతం వీటిని నీటితో నింపితే జంతువులకు తాగునీటి సదుపాయం కలుగుతుందని, దీంతో అవి గ్రామాల్లోకి రావని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో 12 సోలార్‌ మోటార్లు ఉండగా, వాటిలో 10 మాత్రమే పనిచేస్తున్నాయి. దంతేపల్లి అటవీప్రాంతంలో ఉన్న సోలార్‌ మోటార్‌ నడిస్తే ఆప్రాంతంలో చాలా వరకు నీటి ఎద్దడి తీరుతుంది. ఈప్రాంతంలో వేల సంఖ్యలో ఉన్న వన్య ప్రాణులకు తాగు నీటి సదుపాయం కలుగుతుంది. కాగా మూడేళ్లుగా అది పనిచేయడం లేదు. అధికారులు మరమ్మతులు చేయిస్తున్నా, తరచూ బోరు పూడుకుపోతుండటంతో ఈసమస్య తలెత్తింది. కొత్తగా బోర్లు తవ్వించి సోలార్‌ మోటార్లు బిగిస్తే చాలా వరకు జంతువులకు తాగునీటి సమస్య పరిష్కారమవుతుంది. ఇదిలా ఉండగా గతంలో జంతువులు నీటి కోసం గ్రామాల శివారులోకి వచ్చి మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement