మెదక్ కలెక్టరేట్: మహాత్మా జ్యోతిబా పూలే స్ఫూ ర్తితో ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యతనిస్తూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ పిలుపునిచ్చారు. పూలే జయంతిని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలోని బోధన్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పూలే సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారత కోసం చేసిన కృషి చేశాడని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. సమాజంలో వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే పూలే ఆశయమని గుర్తుచేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు, డీఎస్పీ ప్రసన్నకుమార్,మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేష్‌గౌడ్, రామాయంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్య, టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు నరేందర్, కార్యదర్శి రాజ్‌కుమార్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దుబాసి సంజీవ్, బీసీ సంఘం నాయ కులు మెట్టు గంగారాం, నోముల శ్రీకాంత్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతిమాసింగ్


