మెదక్ కలెక్టరేట్: ‘హెల్త్ వీక్’ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలో డ్రగ్స్ కంట్రోల్– రెగ్యులేటరీ స్ట్రెంథనింగ్ డే నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా నుంచి టీఎన్జీఓ భవన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించగా, డీఎంహెచ్‌ఓ శ్రీరామ్ ప్రారంభించారు. అనంతరం టీఎన్జీఓ భవన్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ప్రతిమాసింగ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని మూకుమ్మడిగా అరికట్టాలని పిలుపునిచ్చారు. మెడికల్ షాపుల్లో అమ్మే మందులకు డాక్టర్ పిస్క్రిప్షన్ తప్పనిసరిగా ఉండాలన్నారు. అదనపు కలెక్టర్ నగేశ్ మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలన్నారు. ఈగల్ ఫోర్స్ ఏసీపీ శివనాయుడు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు విక్రయిస్తే చట్టంలో కఠిన శిక్షలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేశ్‌గౌడ్, ఇతర అధికారులు, ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు.
కనీస వసతులు కల్పించాలి
మెదక్ కలెక్టరేట్: నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్ చేసి, విద్యార్థులకు కనీస వసతులు, మంచి భోజనం అందించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కళాశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెయింటెనెన్స్ పేరుతో విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేయడం దారుణం అన్నారు. శిథిలావస్థలో ఉన్న హాస్టల్ భవనంలో విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారని వాపోయారు. కలెక్టర్ తక్షణం స్పందించి విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు గణేష్, చింటూ తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి
నర్సాపూర్ రూరల్: వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ వంటలు చేయాలని మెదక్ ఆర్సీఓ బలరాంనాయక్ వంట సిబ్బందికి సూచించా రు. శనివారం మండలంలోని నారాయణపూర్ గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో వంట సిబ్బందికి వర్క్‌షాప్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మెనూ ఆధారంగా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్నారు. వంట పాత్రలు, గదులు సై తం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వర్క్‌షాప్‌లో ఆయా రకాల వంటలు వండటంతో పాటు విద్యార్థులకు వడ్డించే విధానంపై వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లలితాదేవి, కౌడిపల్లి ప్రిన్సిపాల్ కల్యాణి, ఆయా పాఠశాలల వంట మనుషులు పాల్గొన్నారు.
18 మంది
క్రీడాకారుల ఎంపిక
సంగారెడ్డి క్రైమ్: జిల్లా కేంద్రంలోని ఎంఎస్ క్రికెట్ అకాడమీలో శనివారం ఏర్పాటు చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా అండర్–25 క్రికెట్ సెలక్షన్స్‌లో 18 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ ఇండస్ట్రీస్ సౌజన్యంతో నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లాల నుంచి క్రికెట్ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. డివిజన్ లీగ్ క్రికెట్ పోటీల విభాగంలో సెలక్షన్ చేయగా సంబంధిత క్రీడాకారులు తమ ప్రతిభతో రాణించారు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా కార్యదర్శి రాజేందర్‌రెడ్డి శనివారం మీడియాకు వెల్లడించారు.


