మిల్లింగ్‌కు ససేమిరా! | - | Sakshi
Sakshi News home page

మిల్లింగ్‌కు ససేమిరా!

Apr 12 2026 6:35 AM | Updated on Apr 12 2026 6:35 AM

మిల్లర్లకు ఇచ్చే ధాన్యంలో మొత్తంగా 90 శాతం రారైస్‌, 10 శాతం బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వాలంటూ కేంద్రం ఈసారి కొత్త నిబంధన పెట్టింది. దీంతో ధాన్యం మిల్లింగ్‌కు మిల్లర్లు ససేమిరా అంటున్నారు. యాసంగిలో నూకల శాతం అధికంగా ఉంటుందని, రారైస్‌ ఇవ్వటం సాధ్యం కాదంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో ధాన్యం సేకరణలో సందిగ్ధం నెలకొంది.

– మెదక్‌జోన్‌

జిల్లాలో మొత్తం 102 రైస్‌మిల్లులు ఉండగా, అందులో 38 బాయిల్డ్‌, 64 రారైస్‌ మిల్లులు ఉన్నాయి. ఏటా వానాకాలంలో సుమారు 6 లక్షల పైచిలుకు, యాసంగిలో 5 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వస్తోంది. ఆ ధాన్యాన్ని మిల్లర్లు మరాడించి ఎఫ్‌సీఐకి అప్పగిస్తున్నారు. కాగా ఈ సంవత్సరం మిల్లులకు అప్పగించే ధాన్యంలో 90 శాతం రారైస్‌, 10 శాతం బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వాలని కేంద్రం కొత్త నిబంధన పెట్టింది. యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్‌ చేస్తే 50 శాతానికి పైగా నూకలు వస్తాయని, రారైస్‌ ఇవ్వటం సాధ్యం కాదని, బాయిల్డ్‌ రైస్‌ మాత్రమే ఇస్తామంటూ మిల్లర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు చెబుతున్నారు.

ధాన్యం తీసుకోం..!

గతంలో మాదిరిగానే బాయిల్డ్‌ కొంత, రారైస్‌ కొంత చొప్పున ఇస్తామని పలువురు మిల్లర్లు చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 100 కిలోల ధాన్యం మిల్లింగ్‌ చేస్తే రారైస్‌ 67 కిలోలు, బాయిల్డ్‌ రైస్‌ అయితే 68 కిలోల చొప్పున ఎఫ్‌సీఐకి అప్పగించాలి. ఇది వర్షాకాలంలో పండించిన ధాన్యాన్ని మరాడిస్తే మాత్రమే వస్తోంది. యాసంగిలో సాధ్యం కాదని మిల్లర్లు పేర్కొంటున్నారు. ప్రభుత్వ తీరు మార్చుకోకుంటే ధాన్యం తీసుకోలేమని స్పష్టం చేస్తున్నారు. అధికారులు మాత్రం ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. కాగా ధాన్యాన్ని నేరుగా మిల్లింగ్‌ చేస్తే వచ్చేది రారైస్‌ (బియ్యం) కాస్త సన్నగా ఉంటుంది. అదే బాయిల్డ్‌ రైస్‌ అంటే వేడి నీటిలో ధాన్యాన్ని ఉడకబెడతారు. నూకలు రాకుండా అధికశాతం బియ్యం వస్తాయి. కానీ ఆ బియ్యం దొడ్డుగా ఉంటాయి. వాటిని తినేందుకు ఎక్కువగా ఇష్టపడరు.

23 రకాల కొత్త నిబంధనలు

ఎప్పుడూ లేని విధంగా ఈఏడాది 66 పేజీలలో 23 రకాల కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్లు సమాచారం. గతంలో మిల్లర్లకు ధాన్యం ఇచ్చే ముందు మరో ఇద్దరు మిల్లర్ల జామీన్‌గా తీసుకుని ధాన్యం కేటాయించే వారు. కానీ ఈసారి సదరు మిల్లర్లు అధికారులకు అఫిడవిట్‌ సమర్పించాలి. అగ్రిమెంట్‌పై సివిల్‌ సప్‌లై అధికారితో పాటు జాయింట్‌ కలెక్టర్‌ సంతకాలు సైతం చేసి ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ నూతన నిబంధనతో ఇప్పటి వరకు మిల్లర్లు ముందుకు రావడం లేదు.

90 శాతం రారైస్‌ ఇవ్వాలని కేంద్రం నిబంధన

యాసంగిలో సాధ్యం కాదంటున్న మిల్లర్లు ధాన్యం కొనుగోలులో వీడని సందిగ్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement