● జిల్లాలో మొదటి విడతలో 9,209 ఇళ్లు మంజూరు
● ప్రారంభించినవి 5,337 మాత్రమే
పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లు మంజూరు చేసింది. అయితే ఇళ్లు మంజూరై తొమ్మిది నెలలు గడిచినా, ఇప్పటివరకు 30 శాతం మంది నిర్మాణాలు ప్రారంభించలేదు. కాగా వారి పేర్లను జాబితా నుంచి తొలగించి అర్హులైన వారికి అధికారులు ఇళ్లు మంజూరు చేస్తున్నారు. – మెదక్‌జోన్
జిల్లావ్యాప్తంగా 21 మండలాలు ఉండగా, మొదటి విడతలో 9,209 ఇళ్లు మంజూరయ్యాయి. గడిచిన తొమ్మిది నెలల్లో ఇప్పటివరకు 5,337 మంది లబ్ధిదారులు మాత్రమే ఇళ్ల నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఈ లెక్కన ఇంకా 3,827 మంది నిర్మాణాలు ప్రారంభించలేదు. దీంతో వారి పేర్లను తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇలా ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 500 మంది పైచిలుకు పేర్లను జాబితా నుంచి తొలగించారు. వారి స్థానంలో అర్హులైన 482 మంది లబ్ధిదారుల పేర్లను కొత్తగా జాబితాలో చేర్చారు. నిబంధనల ప్రకారం లబ్ధిదారుడు 45 రోజుల్లో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాలి. లేనిచో ఆ ఇంటిని రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుంది. కాగా పూరిగుసెలో నివాసం ఉంటున్న వారు ఇంటి నిర్మాణం ప్రారంభించక పోయినా, వారి పేర్లు మాత్రం జాబితా నుంచి తొలగించలేదు. వారికి అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఒకవేళ ఆర్థికంగా వెనుకబడి, స్వయం సహాయక గ్రూపు సభ్యులై ఉంటే వారికి సదరు గ్రూపు నుంచి రూ.లక్ష వరకు అప్పు ఇప్పించి ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించే విధంగా చర్యలు చేపడుతున్నారు. గ్రూపులో లేని వారిని గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.
నేతల ప్రమేయంతోనే ఎంపిక
ఇందిరమ్మ ఇళ్ల కోసం నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండగా, రాజకీయ నాయకుల ప్రమేయంతోనే అధికారులు అర్హుల జాబితా తయారు చేసినట్లు తెలిసింది. దీంతో ఇళ్లు మంజూరైన వారికి ఉండేందుకు ఇళ్లు ఉండటంతోనే నిర్మాణాలు ప్రారంభించ లేదని తెలిసింది. ఇక రెండో విడత లబ్ధిదారుల ఎంపికలోనైనా రాజకీయ ప్రమేయం లేకుండా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అర్హులకే ఇళ్లు మంజూరు
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి 9 నెలలు గడుస్తోంది. నేటికీ నిర్మాణాలు ప్రారంభించని వారి పేర్లు జాబితా నుంచి తొలగించి అర్హులైన వారి పేర్లను జాబితాలో చేర్చుతున్నాం. పూరి గుడిసెలో ఉండే వారి పేర్లు మాత్రం ప్రస్తుతానికి తొలగించటం లేదు.
– మాణిక్యం, హౌసింగ్ పీడీ


