వర్గల్(గజ్వేల్): ఉగాది పర్వదిన శుభవేళ దేవదేవుని అష్టోత్తర శతకలశ మహాభిషేకం నేత్రపర్వం చేసింది. నాచగిరీశుడు లక్ష్మీనృసింహుని దివ్యదర్శనంతో భక్తజనావళి తరించింది. సుప్రసిద్ధపుణ్యక్షేత్రం నాచగిరిలో ఆధ్యాత్మిక అనుభూతులు పంచిన బ్రహ్మోత్సవాలు గురువారం అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగిశాయి. ఆలయ ఈఓ బెల్లంకొండ రంగాచారి, చైర్మన్ రవీందర్‌గుప్తా పర్యవేక్షణ, ధర్మకర్తలు, తీర్థజనుల సమక్షంలో ఉదయం అర్చకులు ఆలయ మండపంలో 108 కలశాలు స్థాపన చేశారు. కలశ పూజ నిర్వహించారు. హోమం జరిపారు. పూర్ణ కలశంతో ఆలయ ప్రదక్షిణ చేసి నృసింహ నామార్చనలు, మంత్రోచ్ఛారణల మధ్య గర్భగుడిలో మూలవిరాట్టులకు మహాభిషేకం జరిపారు. పట్టువస్త్రాలు, పూలమాలికలు, సర్వాభరణాలతో శ్రీ లక్ష్మీ సమేత నృసింహస్వామివారిని కమనీయంగా అలంకరించారు. భక్తులు నాచగిరీశుని దివ్యమంగళరూపం దర్శించుకుని తరించారు. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి తీర్థం స్వీకరించారు.


