మెదక్ కలెక్టరేట్: జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని, కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రతిమాసింగ్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేశ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 3,84373 కనెక్షన్లు ఉండగా, 16 ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు గ్యాస్ కొరతపై వస్తున్న అపోహలను నమ్మకూడదని, జిల్లాలో గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయన్నారు. ప్రజలు అనవసరంగా ఆందోళన చెంది అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవద్దని సూచించారు. వంట గ్యాస్ సమస్యలపై కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ (9391942254) ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నర్సాపూర్‌లోని హోటల్స్, రెస్టారెంట్లలో తనిఖీలు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 46 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసినట్లు వివరించారు. అనంతరం ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అక్రమంగా గ్యాస్ నిల్వ చేయడం, అక్రమంగా దారి మళ్లించడం, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామన్నారు. వినియోగదారులు గ్యాస్ బుకింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అనవసర లింకులు ఓపెన్ చేసి సైబర్ క్రైమ్‌కు గురి కావొద్దన్నారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కాగా అదనపు కలెక్టర్ నగేష్ జిల్లాలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం ని ర్వహించి పలు సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద, డీపీఆర్‌ఓ రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతిమాసింగ్


