లెక్కలు.. తేలని చిక్కులు
‘జిల్లాలోని ఓ మేజర్ పంచాయతీలో 14 వార్డులు ఉన్నాయి. అక్కడ ఎన్నికలు నిర్వహించడానికి పోలింగ్ సిబ్బంది, బీఎల్‌ఓలు, ఎన్‌సీసీ విద్యార్థులకు రెండు రోజులకు గాను 150 టిఫిన్లు, భోజనాలు, తాగునీరు, తదితర వాటి కోసం సుమారు రూ. 35 వేలు ఖర్చయయ్యాయి. అయితే పంచాయతీ కార్యదర్శికి ఇచ్చింది మాత్రం రూ. 9 వేలు మాత్రమే. మిగతావి అప్పు చేశాడు.’
– మెదక్ అర్బన్
జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు, 4220 వార్డు మెంబర్ల ఎన్నికల నిర్వహణ కోసం రూ. 4,82,94,890 నిధులు మంజూరయ్యాయి. ఇందులో కొన్ని ఏకగ్రీవం కాగా, మిగితా వాటికి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. అయితే మొదట ఒక్కో ఎంపీడీఓకు జిల్లా పంచాయతీ అధికారి రూ. 50 వేల చొప్పున నిధులు విడుదల చేశారు. అనంతరం పోలింగ్ స్టేషన్‌కు రెండు వేల చొప్పున అందజేశారు. ఇక పంచాయతీ కార్యదర్శులకు పోలింగ్ స్టేషన్‌కు రూ. 500 చొప్పున, పంచాయతీకి రూ. 2 వేల చొప్పున విడుదల చేశారు. ఇవి ఏ మూలకు సరిపోలేదని, అప్పులు చేసి ఎన్నికలు నిర్వహించామని అంటున్నారు. ఒక్కో పంచాయతీ కార్యదర్శి రూ. 10 నుంచి రూ. 20 వేల వరకు చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇక ఎంపీడీఓలు సైతం తమకు ఇచ్చిన నిధులు ఖర్చులకు సరిపోలేవని, ఇంకా కొన్ని వాహనలకు డీజిల్, టెంట్లు, ఫర్నిచర్, టీఏలు, డీఏల కోసం చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. పెద్ద మండలాల్లో సు మారు రూ.15 లక్షల వరకు అవసరమవుతాయని తెలుస్తోంది. ఈ మేరకు ఈ విషయాన్ని ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా సిద్దిపేట జిల్లాలో పోలింగ్‌స్టేషన్‌కు రూ. 2,0400 చొప్పున ఇస్తున్నట్లు స్థానిక పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్పు చేసి తిప్పలు పడుతున్నామంటున్న అధికారులు
అదనపు డబ్బుల కోసం ఎదురుచూపులు
జిల్లాకు రూ. 4.83 కోట్లు మంజూరు
మరో రూ. 1.25 కోట్లు అవసరం
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి లెక్కలు చేస్తున్నాం. మరో నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుంది. మరో రూ.1.25 కోట్లు అవసరమవుతాయని భావిస్తున్నాం. ఎన్నికల అధికారులకు టీఏ, డీఏలు, ఎంపీడీఓలకు, పంచాయతీ కార్యదర్శులకు డ బ్బులు చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో నిధులు మంజూర య్యే అవకాశం ఉంది.
– యాదయ్య, డీపీఓ


