మరింత సహకారం
రామాయంపేట(మెదక్): గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) బలోపేతానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. రైతులకు రుణ సదుపాయం, విత్తనాలు, ఎరువుల పంపిణీని మరింత చేరువ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈక్రమంలో జిల్లాలో అదనంగా మ రో పది కొత్త సహకార సంఘాలను ఏర్పాటు చేయడానికి కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రస్తుతం ఉన్న 37 సంఘాలకు తోడు కొత్తవి మంజూరైతే మొత్తం సంఘాల సంఖ్య 47కు చేరనుంది. జిల్లాలోని 21 మండలాలకు గాను నాలుగు మండలాల్లో సహకార సంఘాలు లేవు. దీంతో సదరు మండలాల పరిధిలో రైతులకు సొసైటీల నుంచి విత్తనాలు, ఎరువులు, రుణాలు సక్రమంగా అందక వారు ఇబ్బందులపాలవుతున్నారు. అయితే జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్న ఏ, బీ గ్రేడ్ సంఘాల నుంచి ఆరు కొత్త సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. గతంలో 29 కొత్త సంఘాల ఏర్పాటు కోసం దరఖాస్తులు రాగా, అధికారులు పది సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. కొత్త మండలాలైన చిలప్‌చెడ్, మాసాయిపేట, మనోహరాబాద్, హవేళిఘణాపూర్‌లో నూతన సహకార సంఘాలు ఏర్పాటు కానున్నాయి. కాగా జిల్లాలో అతిపెద్ద మెదక్ సొసైటీ పరిధిలో 58 గ్రామాలకు చెందిన ఆరు వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. నాగాపూర్, ఫరీద్‌పూర్ సొసైటీలు ఒక్కో గ్రామంలోనే కొనసాగుతున్నా, వీటి సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని అధికారులు అంటున్నారు.
కొత్త సొసైటీల వివరాలు..
బూర్గుపల్లి, సోమక్కపేట, మాసాయిపేట, మనోహరాబాద్, వెంకట్రావుపల్లి, రెడ్డిపల్లి, కొడపాక, నార్లాపూర్, ఎనగండ్ల, గోమారం గ్రామా ల్లో త్వరలో నూతన సొసైటీలు ఏర్పాటు కానున్నాయి. పెద్ద సొసైటీలైన మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్, వెల్దుర్తి, కౌడిపల్లి, కొత్తపల్లి, శివ్వంపేట, రంగంపేట, సోమక్కపేట సహకార సంఘాల నుంచే కొత్త సంఘాలు ఏర్పాటు కానున్నాయి. కాగా కొత్త సంఘాలు ఏర్పాటు అనంతరమే సహకార ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రతిపాదనలు పంపాం
జిల్లాలో ప్రస్తుతం ఉన్న 37 సొసైటీలకు అదనంగా మరో పది కొత్త సొసైటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం. త్వరలో మంజూరయ్యే అవకాశం ఉంది. కొత్త సొసైటీలు మంజూరైతే పరిపాలనా సౌలభ్యంగా ఉంటుంది. రైతులకు మంచి సేవలు అందుతాయి.
– కరుణాకర్, జిల్లా సహకార అధికారి
జిల్లాకు కొత్తగా మరో 10 సహకార సంఘాలు
నాలుగు కొత్త మండలాలతో పాటు ఇతర గ్రామాల్లో ఏర్పాటుకు కసరత్తు


