లోకల్.. దంగల్
మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 11,14,17తేదీల్లో పోలింగ్ రేపటి నుంచి 29వరకు మొదటి దశ నామినేషన్
షెడ్యూల్ విడుదల
మెదక్‌జోన్: స్థానిక సంస్థల(సర్పంచ్, వార్డుసభ్యుల) ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల కోడ్ డిసెంబర్ 17 వరకు అమల్లో ఉంటుంది. మెదక్ జిల్లాలో 21 మండలాల పరిధిలో 492 గ్రామాలు, 4,220 వార్డులు ఉండగా 5,23,327 మంది ఓటర్లున్నారు. ఇందులో2,51,532 మంది పురుషులు ఉండగా 2,71,787 మంది మహిళా ఓటర్లు, 8 మంది ఇతరులు ఉన్నారు. ఈ ఎన్నికలు మూడు విడతల్లో జరుగనుండగా అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకు సంబంధించి ఎన్నికల సామగ్రిని జిల్లా కేంద్రం నుంచి మొదటి విడత ఎన్నికలు జరిగే ఆయా మండలాలకు తరలించారు. కాగా, ఇప్పటికే ఎన్నికలు నిర్వహించే రిటర్నింగ్ అధికారులు(ఆర్‌ఓ) అసిస్టెంట్ రిటర్నింగ్ (ఏఆర్‌ఓ) అధికారులతోపాటు ఇతర అధికారులకు ఇప్పటికే పలుదఫాలుగా శిక్షణ ఇచ్చారు.
ఈనెల 30నుంచి డిసెంబర్ 2వ తేదీవరకు నామినేషన్లు, డిసెంబర్ 3న, స్క్రూట్నీ, అదేరోజున అభ్యర్థుల జాబితా డిసెంబర్ 4న, ఫిర్యాదులు, 6న నామినేషన్ల ఉపసంహరణ అదేరోజున బరిలోనిలిచే అభ్యర్థుల జాబితా, డిసెంబర్ 14 పోలింగ్ అదేరోజున ఫలితాలు వెలువరిస్తారని ఈసీ వెల్లడించింది.
డిసెంబర్ 3నుంచి 5 వరకు నామినేషన్లు, 6న పరిశీలన, 7న ఫిర్యాదులు, 9న విత్‌డ్రాలు అదేరోజున తుదిజాబితా వెల్లడి, 17న పోలింగ్ అదేరోజున కౌంటింగ్ ఉంటాయని ఎన్నికల కమిషన్ తెలిపింది.
జిల్లాలో 21 మండలాలు ఉండగా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో మొదటి విగతలో 6 మండలాల్లో జరుగనున్నాయి ఇందులో అల్లాదుర్గ్, రేగొడు, టేక్మాల్, హవేళిఘనాపూర్, పాపన్నపేట, పెద్దశంకరంపేట మండలాలకు ఎన్నికలు జరుగనున్నాయి. రెండవ విడతల్లో 8 మండలాల్లో భాగంగా తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగ్, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, మెదక్ మండలాలకు మూడవ విడతలో 7 మండలాల పరిధిలోని గ్రామాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అందులో భాగంగా నర్సాపూర్, చిలిపిచెడ్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, మాసాయిపేట, వెల్దూర్తి మండలాలకు ఎన్నికలు జరుగనున్నట్లు అధికారులు తెలిపారు.
పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ
ఇదీ షెడ్యూల్
గురువారం నుంచి ఈనెల 29 వరకు మూడు రోజుల పాటు నామినేషన్లు 30న నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 1న, ఫిర్యాదులు, డిశంబర్ 3న నామినేషన్ల ఉపసంహరణ, అదేరోజున సాయంత్రం అభ్యర్థుల తుదిజాబితా వెల్లడి, డిసెంబర్ 11న ఎన్నికలు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు అదేరోజున ఓట్లలెక్కింపు ఫలితాల విడుదల ఉంటాయని ఎన్నికల కమిషన్ పేర్కొంది.
అధికారులకు సెలవులు రద్దు: కలెక్టర్
మెదక్ కలెక్టరేట్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. ఎన్నికలు ముగిసే వరకు అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం రాత్రి తన క్యాంపు కార్యాలయం నుంచి డీఎల్పీఓలు, ఎంపీడీలు, ఎంపీఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పకడ్బందీగా, ప్రశాంత వాతావరణం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. ఏ దశలోనూ అలసత్వానికి తావు ఇవ్వకూడదన్నారు. నిఘా బృందాలను నియమించి, పకడ్బందీగా కోడ్ అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించాలన్నారు. వీడియో కాన్ఫరెన్‌న్స్‌లో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.


