లాభమా.. నష్టమా..!
పటాన్‌చెరు/రామచంద్రాపురం(పటాన్‌చెరు): పటాన్‌చెరు నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ విలీన ప్రక్రియతో లాభమా.. నష్టమా అనే విషయమై బేరీజు వేసుకుంటున్నారు. ప్రగతి పరుగులు పెడుతోందని కొందరు వాదిస్తుండగా.. తమకు మాత్రం తీవ్ర నష్టం చేకూరుస్తోందని రాజకీయ పార్టీల నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఏ సమస్య వచ్చినా మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళితే.. వెంటనే పరిష్కారమయ్యేదని, అదే జీహెచ్‌ఎంసీ అయితే అధికారులు దొరకడమే గగనమవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా విలీనంపై అనేక భిన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం 7000 జనాభా ఉన్న అమీన్‌పూర్‌లో నరేగూడెం, బీరంగూడ, బంధన్ కొమ్ము, ఇసుక బావి, మధిర గ్రామాలుగా ఉండేవి. పంచాయతీ పాలనలో ఉన్న అమీన్‌పూర్ అనూహ్యంగా అమీన్‌పూర్ మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. 40 వేల ఓటర్లతో అమీన్‌పూర్ మున్సిపాలిటీగా 2019లో అవతరించింది. మున్సిపల్ చైర్మన్‌గా తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో 24 మంది కౌన్సిల్ సభ్యులతో మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటైంది. పాలకవర్గం కాలపరిమితి కూడా ముగిసింది.
తెల్లాపూర్ మున్సిపల్..
గతంలో తెల్లాపూర్, ఉస్మాన్‌నగర్, కొల్లూరు, ఈదుల నాగులపల్లి, వెలిమెల గ్రామాలను కలుపుతూ 2018లో తెల్లాపూర్‌ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. సుమారు లక్ష 70 వేల జనాభా ఉంటుంది. మున్సిపల్ చైర్‌పర్సన్ మల్లేపల్లి లలిత సోమిరెడ్డి ఆధ్వర్యంలో 17 మంది కౌన్సిల్ సభ్యులతో మున్సిపల్ ఏర్పడింది.
తెల్లాపూర్, అమీన్‌పూర్, బొల్లారం మున్సిపాలిటీలు జీహెచ్‌ఎంసీలో విలీనం పై చర్చ


