కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు
పీసీసీ అధ్యక్షుడి ఎదుటే
రెండు వర్గాల గొడవ
ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు
శివ్వంపేట(నర్సాపూర్): పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మంగళవారం శివ్వంపేటలో బగలాముఖీ శక్తిపీఠంలో యాగశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా ఆయన ఎదుటే కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. పీసీసీ కాన్వాయ్ శివ్వంపేట శివారుకు రాగానే పార్టీ మండల అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ఆయనకు స్వాగతం పలికి బగలాముఖీ ఆలయానికి వస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవీన్‌గుప్తా ఆధ్వర్యంలో గ్రామంలో స్వాగత కార్యక్రమం చేపట్టారు. అక్కడ కాన్వాయ్ ముందు ఇరు వర్గాలు తోసుకుంటూ దాడులకు పాల్పడటంతో తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి వారిని చెదరగొట్టారు. పీసీసీ, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి ఎదుటే కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు చోటుచేసుకోవడంతో చర్చనీయాంశంగా మారింది.


