రుణపరిమితి రూ.20 లక్షలకు పెంచాలి
u
ఎమ్మెల్యే సునీతారెడ్డి
నర్సాపూర్ రూరల్/మనోహరాబాద్(తూప్రాన్): మహిళా సంఘాలకు ప్రస్తుతం అందజేస్తున్న రూ.5 లక్షల వడ్డీ లేని రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంచాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. నర్సాపూర్ మండలం లింగాపూర్ రైతు వేదికలో మంగళవారం ఏర్పాటు చేసిన వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం మండలంలోని లింగాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. తర్వాత మనోహరాబాద్ మండలంలోని గౌతోజీగూడెంలో ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ.. నర్సాపూర్ నియోజకవర్గంలోని 3,986 మంది మహిళల తోడ్పాటుకు రూ.2.86 కోట్ల వడ్డీ లేని రుణాలను అందించడం శుభపరిణామమన్నారు. పెండింగ్‌లో ఉన్న వడ్డీ లేని రుణాలను సైతం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్, సఖి కేంద్రాలతోపాటు ప్రభుత్వ చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సుచించారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడుతూ..మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అందులోభాగంగా జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు రూ.500కోట్ల రుణాలను బ్యాంకు లింక్ ద్వారా అందించామని తెలిపారు. రూ.90 కోట్లు ఇందిరా మహిళా శక్తి యూనిట్లకు ఖర్చు చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసినిరెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, జెడ్పీ సీఈవో ఎల్లయ్య, అదనపు పీడీ సరస్వతి, ఆర్డీవో మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ ప్రభాకర్, సెక్రెటరీ అనిత, శ్రీనివాస్‌గుప్తా, శ్రీధర్‌గుప్తా, నయుం, మాజీ సర్పంచ్ అశోక్ ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.


