దర్యాప్తు వేగవంతం చేయాలి
● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక ప్లాన్ ● సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించాలి ● ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
మెదక్ మున్సిపాలిటీ: ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని, లాంగ్ పెండింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక కార్యాచరణ ఉండాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారి నేర సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో వేగవంతమైన దర్యాప్తు జరగా లని, బాధితులకు న్యాయం అందించడంలో ఏ ఆలస్యం జరగకూడదని స్పష్టం చేశారు. అత్యాచార, పొక్సో కేసులలో నిర్ణీత గడువులోగా దర్యాప్తు పూర్తి చేసి, దోషులను కోర్టు ముందు నిలపాలని ఆదేశించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసి అమలు చేయాలన్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టులు పెండింగ్‌లో ఉన్న కేసులను తక్షణమే పూర్తి చేయాలన్నారు. మైనర్లు వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదన్నారు. అవసరమైతే లైసెన్సులు రద్దు చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల పట్ల అప్రమత్తంగా, నిబద్ధతతో ఎలాంటి గొడవలకు తావు లేకుండా జరిగేటట్లు సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలన్నారు. స్పెషల్ లోక్‌ఆదాలత్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను, సిబ్బందిని ప్రశంసాపత్రం అందజేసి ఎస్పీ అభినందించారు. సమావేశఃలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సీఐలు జార్జి రేణుకారెడ్డి, మహేష్, కృష్ణ మూర్తి, సందీప్ రెడ్డి, రంగా కృష్ణ, ఎస్‌ఐ పాల్గొన్నారు.


