
సాహసానికి పురస్కారం
సీఎం చేతుల మీదుగా అవార్డు
అందుకున్న కానిస్టేబుల్ వంశీ
మెదక్ మున్సిపాలిటీ:మెదక్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ వంశీ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. గ్రే హౌండ్స్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో అత్యుత్తమ కర్తవ్య నిర్వహణ, అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించినందుకు గాను ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ గ్యాలెంట్రీకి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా వంశీని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు అభినందించారు.
అంగడి ఆగమాగం
వర్షంతో కొట్టుకుపోయిన కూరగాయలు
నర్సాపూర్: పట్టణంలో శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో అంగడి ఆగమాగమైంది. ప్రతి శుక్రవారం నర్సాపూర్‌లో అంగడి నిర్వహిస్తారు. కూరగాయలు, బట్టలు, ఇతర నిత్యావసర సరుకులు, పండ్లు, ఇండ్లలో వినియోగించే పనిమట్లు అమ్మే వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయిస్తారు. సాయంత్రం కురిసిన కుండపోతకు కొనుగోళ్లు జరగలేదు. పైగా వర్షం నీటిలో కూరగాయలు కొట్టుకుపోయాయి. వర్షంతో తమకు చాలా నష్టం వచ్చిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా భారీ వర్షంతో రోడ్లపై నుంచి వర్షం నీరు ఎక్కువగా పారడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు.
యూరియా కృత్రిమ కొరత
సృష్టిస్తే చర్యలే: దేవ్ కుమార్
వెల్దుర్తి(తూప్రాన్): యూరియాను కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బంది పెడితే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్‌కుమార్ హెచ్చరించారు. మాసాయిపేట మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రం ఆగ్రోస్‌ను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. స్టాక్ రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాలని, ఎక్కువ ధరలకు విక్రయిస్తే వారి లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్, ఏఈఓ రజిత తదితరులు పాల్గొన్నారు.
చిలప్‌చెడ్‌లో
14.6సెం.మీ వర్షం
చిలప్‌చెడ్(నర్సపూర్): చిలప్‌చెడ్ మండలంలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు 14.6 సెం.మీ వర్షం కురిసింది. జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదైనట్లు మండల గణాంకాధికారి దివ్యభారతి శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, కురుస్తున్న భారీ వర్షాలకు చిలప్‌చెడ్ మండలంలోని పలు గ్రామాల్లోని చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాల్లో పంటపొలాలు నీట మునిగాయి. చిలప్‌చెడ్‌లో కురిసిన వర్షానికి పాక్షికంగా కూలిన ఇళ్లు తహాశీల్దార్ సహాదేవ్ పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ సునీల్‌సింగ్ ఉన్నారు.
చినుకుపడితే కరెంట్ కట్
సరఫరాలో తీవ్ర అంతరాయం
నర్సాపూర్: నర్సాపూర్‌లో కరెంటు సరఫరాలో అంతరాయం సాధారణమైందని వినియోగదారులు వాపోతున్నారు. ప్రతి రోజు కరెంట్ కోతలు ఉంటున్నాయని, చినుకు పడితే కరెంటు పోతుందని, మళ్లీ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. రెండు రోజులుగా కరెంట్ సరఫరాలో అంతరాయం మరింత ఎక్కువైందని స్థానికులు తెలిపారు. శుక్రవారం సైతం కరెంటు చాలా సార్లు పోయిందని అన్నారు. కరెంట్ ఎక్కువ సార్లు పోవడంతో విద్యుత్తు పరికరాలు పాడుతున్నాయని అన్నారు. పట్టణంలో కరెంటు సరఫరాను మెరుగు పర్చాలని వినియోగదారులు కోరుతున్నారు.

సాహసానికి పురస్కారం