
ఉధృతంగా మంజీరా
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మంజీర వరదల నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ వెల్లడించారు. సింగూరు నుంచి 20,265 క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో మంజీర ఉరకలెత్తి ప్రవహిస్తోంది. దీంతో ఘనపురం ఆనకట్ట పొంగిపొర్లుతోంది. శుక్రవారం ఏడుపాయల్లో పరిస్థితిని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఇరిగేషన్, పోలీసు, ఆలయ అధికారులతో సమీక్షించారు. మంజీర వరద ఉధృతిని ఎప్పటి కప్పుడు అంచనా వేస్తుండాలని అధికారులకు సూచించారు. భక్తులెవరూ మంజీర నది వైపు వెళ్లకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టాపర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండాలన్నారు. పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట ఇరిగేషన్ అధికారులు, పాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్‌గౌడ్, పోలీసులు, ఆలయ సిబ్బంది ఉన్నారు.
దుర్గమ్మను దర్శించుకున్న జిల్లా జడ్జి
జిల్లా న్యాయమూర్తి నీలిమ శుక్రవారం కుటుంబ సభ్యులతో కలసి దుర్గమ్మ ను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంధర్భంగా ఆలయ అర్చకులు, సిబ్బంది ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. రాజగోపురంలో ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహానికి ఆమె పూజలు చేశారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి, శాలువాతో సత్కరించారు.
● సింగూరు నుంచి 20వేలక్యూసెక్కుల నీరు విడుదల
● పరిస్థితిని సమీక్షించిన
కలెక్టర్ రాహుల్‌రాజ్