ప్రభుత్వంపై నమ్మకంతో సమ్మె విరమించాం
టీఎంయూ రాష్ట్ర నాయకుడు అశ్వత్థామరెడ్డి
పాపన్నపేట(మెదక్): ప్రభుత్వంపై నమ్మకంతోనే ఆర్టీసీలో తలపెట్టిన సమ్మెను విరమించామని టీఎంయూ రాష్ట్ర నాయకుడు అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఏడుపాయల్లో మంగళవారం జరిగిన ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ...ఆర్టీసీ కార్మికులు అనేక సమస్యలతో సతమవుతున్నారని చెప్పారు. వీటి పరిష్కారం కోసం అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా, ఫలితం లేకుండా పోయిందన్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు సిద్ధమయ్యామని చెప్పారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన హమీ మేరకు సమ్మె విరమించుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎంఆర్‌కే రావు, శాఖన్న, అశ్వక్, వెంకన్న, నర్సింహులు, ముత్యం,హన్మయ్య, క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.


