మెలకువలు.. మెరుగులు
● 6న ముగియనున్న వేసవి శిక్షణ ● అథ్లెటిక్స్ పోటీలకు సన్నద్ధం
చేగుంట(తూప్రాన్): అథ్లెటిక్స్ పోటీలకు నిష్ణాతులుగా తయారు చేసేందుకు ప్రభుత్వం యూత్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో బాల బాలికలకు వేసవి శిక్షణ ఇస్తుంది. జిల్లాలో కేవలం చేగుంటలో మాత్రమే శిబిరం ఏర్పాటు చేశారు. మేలో ప్రారంభించిన శిక్షణ ఈనెల 6వ తేదీతో ముగియనుంది. అథ్లెటిక్స్ శిక్షణలో భాగంగా 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల బాల, బాలికలలకు అవకాశం కల్పించారు. రన్నింగ్, షార్ట్‌పుట్, లాంగ్‌జంప్, డిస్కస్ త్రో, జావెలింగ్ త్రో వంటి వాటిలో మెలకువలతో పాటు శారీరక దృఢత్వం కోసం వ్యా యామం చేయిస్తున్నారు. వీటితో పాటు జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ సౌజన్యంతో రగ్బీ క్రీడకు సంబంధించిన శిక్షణ సైతం అందిస్తున్నారు. మండల కేంద్రమైన చేగుంటలోని స్టేడియంలో ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రెండున్నర గంటల పాటు శిక్షణ నిర్వహిస్తున్నారు. వేసవి సెలవుల్లో బాల బాలికలకు శిక్షణ ఉపయోగరంగా మారింది. చేగుంట, వడియారం, రెడ్డిపల్లి, చిట్టోజిపల్లి గ్రామాల బాల బాలికలను తల్లిదండ్రులు శిబిరానికి పంపుతున్నారు. వీరితో పాటు సెలవుల్లో భాగంగా చేగుంటలోని బంధువుల ఇళ్లకు వచ్చిన వివిధ జిల్లాలకు చెందిన చిన్నారులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. ఇక్కడ మెలకువలు నేర్చుకున్న వారు జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకు నిర్వహించే పోటీల్లో పాల్గొననున్నారు.


