జిల్లాలో మందకొడిగా ధాన్యం సేకరణ
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. సెంటర్లు ప్రారంభించి రెండు నెలలు కావొస్తున్నా వడ్ల సేకరణ పూర్తి కాకపోవడంతో రైతులు రోజుల తరబడి కల్లాల వద్దే జాగారం చేస్తున్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి మొలకెత్తుతుండటంతో అరిగోస పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. – మెదక్‌జోన్
● వెంటాడుతున్న అకాల వర్షాలు ● ఇంకా 1.20 లక్షల మెట్రిక్ టన్నులుకేంద్రాల్లోనే.. ● ఆందోళనలో అన్నదాతలు
జిల్లావ్యాప్తంగా యాసంగిలో 2.95 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా, కొనుగోలు కేంద్రాలకు 3.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందుకనుగుణంగా జిల్లాలో 498 సెంటర్లను ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించారు. అందులో 92 కేంద్రాలను ప్రత్యేకంగా సన్నధాన్యం సేకరణ కోసం, 406 సెంటర్లను దొడ్డు ధాన్యం కోసం ఏర్పాటు చేశారు. కాగా దొడ్డు రకం ధాన్యం కోసం ఏర్పాటు చేసిన 406 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు 155 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి చేశారు. సన్నాల సేకరణ కోసం ఏర్పాటు చేసిన 92 కేంద్రాలు అలాగే కొనసాగుతున్నాయి.
సేకరించింది 2.60 లక్షల మెట్రిక్ టన్నులు
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నేటికీ 55 రోజులు అయింది. ఇప్పటివరకు రైతుల నుంచి 2.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. అందులో దొడ్డుకరం 2,14,634 మెట్రిక్ టన్నులు కాగా, సన్నాలు 46,110 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి రూ. 426.52 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు.
బోనస్ డబ్బులు ఎప్పుడో..?
కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్ ధాన్యానికి రూ. 2,320 చొప్పున మద్దతు ధర చెల్లిస్తుండగా, సన్నధాన్యం కోసం ప్రభుత్వం అదనంగా ఇచ్చే క్వింటాల్‌కు రూ. 500 బోనస్ డబ్బులు మాత్రం ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. సన్నధాన్యం 46,110 మెట్రిక్ టన్నులు రైతులు కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించారు. ఇందుకు సంబంధించి క్వింటాల్‌కు రూ. 2,320 చొప్పున మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ కలిపితే క్వింటాల్‌కు రూ. 2,820 అవుతుంది. అయితే బోనస్ డబ్బులు ఇవ్వకుండా కేవలం మద్దతు ధరను మాత్రమే రైతు ఖాతాల్లో జమచేస్తున్నారు. ఇప్పటివరకు విక్రయించిన ధాన్యానికి రైతులకు చెల్లించాల్సిన బోనస్ డబ్బులు రూ. 23.6 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని ఎప్పుడు చెల్లిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. గత వానాకాలంలోనూ బోనస్ డబ్బుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరగటంతో అన్నదాతలు ఇబ్బంది పడ్డారు. ఈసారి అలా కాకుండా సకాలంలో చెల్లించాలని కోరుతున్నారు.
జిల్లా వివరాలు ఇప్పటివరకు సేకరించిన ధాన్యం 2.60 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా కొనాల్సింది
1.20 లక్షల మెట్రిక్ టన్నులు
పూర్తయిన సెంటర్లు 155
వారంలో పూర్తి చేస్తాం: కలెక్టర్
చిన్నశంకరంపేట(మెదక్): మరో వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. శనివారం మండలంలోని అంబాజీపేటలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. రైతులకు వెంట వెంటనే డబ్బులు జమ చేస్తున్నట్లు చెప్పారు. సన్న వడ్ల బోనస్ కూడ త్వరలో అందనుందని వివరించారు. అదనంగా హమాలీలతో పాటు 150 లారీలను సమకూర్చినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట తహసీల్దార్ మన్నన్ ఉన్నారు.


