మాదకద్రవ్యాలను నియంత్రించాలి
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ కలెక్టరేట్: విద్యార్థులు, యువత భవిష్యత్తుపై మాదకద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఎస్పీ డీవీ శ్రీనివాసరావుతో కలిసి మానసిక వైద్య నిపుణులు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, విక్రయం, వినియోగాలను నిరోధించేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. గంజాయి, మత్తుపదార్థాలు వినియోగించడం వల్ల కలిగే నష్టాలపై ర్యాలీలు, వ్యాసరచన, చిత్రలేఖనం, క్లబ్ ఏర్పాట్లు ఇతర వివిధ రకాల పద్ధతుల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డ్రగ్స్ రిహాబిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పా టు చేశామన్నారు. ఇన్‌పేషెంట్ సేవలకు కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. గురుకులాలు, వసతిగృహాలు, అన్ని విద్యాసంస్థల్లో ప్రహరీ, కారిడార్లు, పరిసరాలు స్పష్టంగా కనిపించే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. బెల్ట్ షాపులు, గుడుంబా స్థావరాలపై పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.


