సిబిల్.. గుబుల్!
రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారులకు సిబిల్ గుబులు పట్టుకుంది. సిబిల్ స్కోర్‌తో సంబంధం లేదని ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించినా.. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని బ్యాంకర్లు చెబుతున్నారు. దరఖాస్తులను సిబిల్ స్కోర్‌తో ముడిపెడుతూ అర్హుల ఎంపిక చేపడుతున్నారు. దీంతో అసలు రుణం వస్తుందా? లేదా? అనే అనుమానం నిరుద్యోగుల్లో వ్యక్తమవుతోంది.
– మెదక్‌జోన్
జిల్లావ్యాప్తంగా రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కలిపి మొత్తం 32 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకంలో రూ. లక్ష నుంచి రూ. 4 లక్షల వరకు సబ్సిడీ రుణాలను ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నచ్చి న యూనిట్‌ను ఎంపిక చేసుకొని ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం ఆయా మండలాల ఎంపీడీఓలతో పాటు మున్సిపల్ కార్యాలయాల్లో సంబంధిత పత్రాలను అందజేశారు. వాటిని స్వీకరించిన అధికారులు బ్యాంకర్లకు పంపించారు. ప్రస్తుతం వారు లబ్ధిదారుల సిబిల్ స్కోర్‌ను పరిశీలిస్తున్నారు. దాని ఆధారంగానే అర్హులను ఎంపిక చేసే ప్రక్రియలో నిమగ్నమైనట్లు తెలిసింది. అయితే ఇటీవల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాజీవ్ యువ వికాసానికి సిబిల్ స్కోర్ తో సంబంధం లేదని ప్రకటింటినా, బ్యాంకర్లు అవేం పట్టించుకోవడం లేదు.
అనర్హులుగా తేలే అవకాశం!
బ్యాంకు లావాదేవీలు చేసే ప్రతి ఒక్కరికీ సిబిల్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. రుణం తీసుకునే సమయంలో దీన్ని ప్రామాణికంగా పరిగణించి.. సదరు వ్యక్తి అర్హతను నిర్ధారిస్తారు. బ్యాంకులో తీసుకున్న రుణం సకాలంలో చెల్లించకపోయినా.. పాతబకాయి కోసం వన్ టైం సెటిల్‌మెంట్ చేసుకున్నా.. ఇలా అనేక రకాల పద్ధతులపై సిబిల్ స్కోర్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రాజీవ్ యువవికాసం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో మెజార్టీ ప్రజలు సిబిల్ స్కోర్‌కు అర్హత సాధించే అవకాశం లేదని చర్చ జరుగుతోంది. చాలా మంది బ్యాంకుల ద్వా రా పంట రుణం తీసుకున్న వారు ఉన్నారు. రుణమాఫీ అవుతుందని సకాలంలో చెల్లించని వారు ఉన్నారు. దీంతో వారు అర్హత కోల్పోయే అవకాశం ఉంది. అదే జరిగితే జిల్లావ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 32 వేల మందిలో కేవలం 8 వేల మంది మాత్రమే అర్హులుగా తేలే అవకాశం ఉందని తెలుస్తోంది.
గందరగోళంగా‘రాజీవ్ యువ వికాసం’
ఎలాంటి ఆదేశాలు రాలేదంటున్న బ్యాంకర్లు
అయోమయంలో దరఖాస్తుదారులు
జిల్లావ్యాప్తంగా 32 వేల దరఖాస్తులు
స్కోర్ ప్రామాణికంగానే రుణాలు
రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన దరఖాస్తులను క్షుణంగా పరిశీలిస్తున్నాం. ముఖ్యంగా దరఖాస్తుదారుడి సిబిల్ స్కోర్‌ను పరిగణలోకి తీసుకుంటున్నాం. సిబిల్ స్కోర్ ను పరిగణలోకి తీసుకోవద్దని ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు.
– మూర్తి, లీడ్ బ్యాంక్ మేనేజర్, మెదక్
సిబిల్.. గుబుల్!


