న్యాల్‌కల్(జహీరాబాద్): మండల పరిధిలోని మామిడ్గి గ్రామంలో నిర్వహించిన (నిమ్జ్) గ్రామ సభలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిమ్జ్ భూసేకరణకు సంబంధించి బుధవారం ఉదయం గ్రామ సమీపంలో గల రైతు వేదికలో పోలీస్ బందోబస్తు మధ్య గ్రామసభ నిర్వహించారు. సభకు నిమ్జ్ ప్రాజెక్ట్ డిప్యూటీ కలెక్టర్ రాజు, న్యాల్‌కల్ తహసీల్దార్ భూపాల్ హాజరయ్యారు. భూసేకరణకు సంబంధించి డిప్యూటీ కలెక్టర్ రాజు మాట్లాడుతూ... నిమ్జ్ ఏర్పాటు వల్ల ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ క్రమంలో కొందరు రైతులు కలుగజేసుకుని మావి సారవంతమైన మూడు పంటలు పండే భూములని, ప్రభుత్వం ఇచ్చే పరి హారం ఎంతమాత్రం సరిపోదని, మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరారు. అదేవిధంగా భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని, లేదా భూమికి బదులుగా భూమి ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో ఒకరిద్దరు రైతులు అభ్యంతరం చెప్పడంతో వారిమధ్య మాటా మాటా పెరిగి స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సభ నుంచి బయటకు వచ్చిన కొందరు రైతులు నిమ్జ్‌కు భూములు ఇచ్చేది లేదని నినాదాలు చేశారు.


