మెదక్‌ లోక్‌సభ స్థానంపై వీడని సస్పెన్స్‌..!

- - Sakshi

అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, బీఆర్‌ఎస్‌

కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశిస్తున్న జగ్గారెడ్డి సతీమణి నిర్మల, నీలం మధు

బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రతాప్‌రెడ్డిని ప్రకటించే అవకాశం!

సాక్షి, సిద్దిపేట: బీజేపీ, బీఆర్‌ఎస్‌లు రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. బుధవారం బీజేపీ మెదక్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌ రావు, బీఆర్‌ఎస్‌ జహీరాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా గాలి అనిల్‌ కుమార్‌ను ప్రకటించాయి. పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు అధికారికంగా గాలి పేరును ప్రకటించారు. ఎంపీ టికెట్‌ను పలువురు ఆశించినప్పటికీ అధిష్టానం అనిల్‌కుమార్‌ వైపే మొగ్గుచూపింది.

లోక్‌సభ పరిధిలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉండటమే కారణంగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. టికెట్‌ను ప్రకటించిన వెంటనే గాలి అనిల్‌కుమార్‌.. పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసి బొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు టి.హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డి, ఉమ్మడి మెదక్‌ జిల్లా డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎం.శివకుమార్‌ తదితరులు కేసీఆర్‌ను కలిశారు. అయితే.. బీజేపీ మెదక్‌ ఎంపీ అభ్యర్థిగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు కు అవకాశం కల్పించింది.

ముందుగా ఊహించినట్లుగానే పార్టీ అధిష్టానం బుధవారం రాత్రి ప్రకటించిన 2 వ జాబితాలో ఆయన పేరును ఖరారు చేసింది. అధిష్టానం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లు రఘునందన్‌ సాక్షి కి తెలిపారు. అలాగే మెదక్‌ ఎంపీ స్థానానికి గాను బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నుంచి ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఆర్‌ఎస్‌ నుంచి.. ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డికి దాదాపు ఖరారు అయ్యే అవకాశం ఉంది.

తొలుత ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి పేరు వినిపించినా పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థిని మార్చాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, నీలం మధు టికెట్‌ ఆశిస్తున్నారు. కాగా, గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి దీపాదాస్‌ను నిర్మల కలిసి తనకు టిక్కెట్‌ ఖరారు చేయాలని కోరినట్లు తెలుస్తోంది.

ఇవి చదవండి: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. బాజిరెడ్డి వైపు మొగ్గు!

Election 2024

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top