మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల సమస్య లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ ప్రతిమాసింగ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచన మేరకు మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా పరిస్థితిని, గోదాముల్లో నిల్వల స్థితిని రోజువారీగా కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు. అలాగే సిలిండర్లు నిల్వ చేయడం, దారి మళ్లింపు, బ్లాక్ మార్కెటింగ్, గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరా లకు అక్రమంగా ఉపయోగించడం వంటి చర్యలను నివారించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో వినియోగదారులకు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు నిరంతరంగా అందుబాటులో ఉండేలా కమిటీ తరచుగా సమావేశాలు నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుంటుందని వివరించారు.


