116 బిల్లులు పంపకపోవడంలో ఆంతర్యం ఏంటి?
● మెడికల్ రీయింబర్స్‌మెంట్ శాఖ పర్యవేక్షకుడిపై చర్యలు!
● ముడుపుల కోసమే డైరెక్ట్‌గా ప్రొసీడింగులు
● ఏసీబీ తనిఖీలతో మెదక్‌లో కలకలం
మెదక్ అర్బన్: ఈనెల 9న ‘మెడికల్ బిల్లులు ఏవీ? ముడుపులు ఇస్తేనే ముందుకు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. శుక్రవారం డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో మెడికల్ రీయింబర్స్ మెంట్ పర్యవేక్షకుడి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఇందులో విస్తుగొలిపే విషయాలు బయట పడినట్లు తెలుస్తోంది. రీయింబర్స్‌మెంట్ కోసం కార్యాలయానికి వచ్చిన బిల్లుల్లో 116 పాస్ అయినప్పటికీ, వాటిని సంబంధిత కార్యాలయాలకు పంపకుండా, తమ వద్దే పెట్టుకోవడం, బిల్లులను ఔట్ వార్డులో నమోదు చేయకుండా, సంబంధికులకే ఇచ్చినట్లు నిర్ధారించారు. లంచాలకు ఆశపడే ఈ చర్యలకు పాల్పడిన ట్లు భావిస్తున్నారు. కార్యాలయంలో రిజిస్టర్‌ల నిర్వహణ కూడా లోప భూయిష్టంగా ఉన్నట్లు గుర్తించారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం ఏసీబీ అధికారుల పూర్తిస్థాయి నివేదిక అనుగుణంగా బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు రూ. 50 వేల లోపు ఉంటే మంజూరు కోసం జిల్లా మెడికల్ సూపరింటెండెంట్ కార్యాలయానికి పంపుతారు. ఇవి సాధారణంగా 21 రోజుల్లో మంజూరు చేయాలి. కానీ ఇక్కడ ఓ పర్యవేక్షకుడు ముడుపులకు ఆశపడి, అన్నీ తానై వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు విచారణ చేశారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఉద్యోగులకు సంబంధించి 282 బిల్లులు వచ్చాయి. అందులో 116 బిల్లులు ఆమోదించారు. వీటిని ఔట్ వార్డులో నమోదు చేసి, సంబంధిత శాఖలకు పంపాలి. కానీ వాటిని నమోదు చేయకుండా, పర్యవేక్షకుడు తన వద్దే పెట్టుకున్నట్లు, డైరక్ట్‌గా వచ్చి అతడిని కలసిన వారికి ప్రొసీడింగులు ఇస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో వారి నుంచి లంచాలు స్వీకరిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. అసలు ఔట్ వార్డు రిజస్టర్ జనవరి 5 వరకు రాసినట్లు, ఆపై ఎంట్రీలు చేయలేదని గుర్తించారు. ఆ తర్వాత సుమారు 60 బిల్లులు వచ్చినట్లు తెలుస్తోంది.
భారీగా పెండింగ్ బిల్లులు
జిల్లా మెడికల్ బోర్డులో మెడికల్ రీయింబర్స్ మెంట్ బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. 2025 మార్చి నుంచి ఈఏడాది మార్చి 5 వరకు 1,053 రీయింబర్స్‌మెంట్ బిల్లులు వచ్చాయి. అందులో 529 చెల్లించారని, మిగితావి పర్యవేక్షకుడి వద్దే పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. బిల్లులు పంపిన తర్వాత ఉద్యోగులు వచ్చి, సదరు పర్యవేక్షకుడిని కలిస్తే వాటికి మోక్షం లభిస్తుందని, లేకుంటే కొర్రీలు వేస్తాడన్న ఆరోపణలున్నాయి. ఒకేసారి వాటిని వెనక్కి పంపుతాడని బాధితులు అంటున్నారు. కార్యాలయంలో తాము రాసిందే రికార్డు అన్నట్లు తమ ఇష్టమొచ్చిన రీతిలో రికార్డులు రాస్తున్నారు. లేకుంటే వాటిని మూలన పడేస్తున్నారన్న విమర్శలున్నాయి. అలాగే మెడికో లీగల్ కేసుల ధ్రువపత్రాలకు సంబంధించిన రిజిస్టర్ కూడా అసంపూర్తిగా ఉన్నట్లు తేలింది. సుమారు 5 గంటల పాటు తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు త్వరలోనే ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తా మని తెలిపారు.
నివేదిక అనుగుణంగా చర్యలు తీసుకుంటాం
మెడికల్ రీయింబర్స్‌మెంట్ విభాగంలో శుక్రవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి రికార్డులు పరిశీలించారు. అవసరమైన సమాచారాన్ని తమతో తీసుకెళ్లారు. వారు ఇచ్చి న నివేదిక అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.
– సునీత, మెదక్ ప్రభుత్వ
జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్


