ప్రారంభమైన ‘పది’ పరీక్షలు
మెదక్ కలెక్టరేట్: పదో తరగతి వార్షిక పరీక్షలు జిల్లాలో శనివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు పరీక్షకు 11,239 విద్యార్థులకు గానూ 11,220 మంది హాజరు కాగా 19 మంది గైర్హాజరయ్యారు. దీంతో 99.83 హాజరు శాతం నమోదైంది. డీఈఓ విజయ, అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓ రమాదేవి, అదనపు ఎస్పీ మహేందర్ పలు సెంటర్లను సందర్శించారు. అలాగే ఇతర పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పరిశీలించాయి. విద్యార్థులను గంట ముందే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా పరీక్షకు పరీక్షకు మధ్య సెలవులు ఉండటంతో ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ సూచించారు. సెలవుల దినాల్లో బాగా చదివి పరీక్షకు సిద్ధమై రావాలన్నారు.


