దుంపలకుంట చౌరస్తా వద్ద ధర్నా చేస్తున్న గ్రామస్తులు
కొల్చారం(నర్సాపూర్): అధికార పార్టీ వారికే బీసీ బంధు మంజూరు చేశారంటూ మండలంలోని ఎనగండ్ల గ్రామ యువకులు ఆదివారం ఆందోళనకు దిగారు. దుంపలకుంట చౌరస్తాలోని మెదక్– జోగిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. వీరికి స్థానిక బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. కమీషన్లు తీసుకొని బీసీ బంధు అందిస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. అక్కడ ఆగిఉన్న ఆర్టీసీ బస్సు అద్దాలను ఓ యువకుడు ధ్వంసం చేశాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మహమ్మద్ గౌస్ సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళనకారులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


