TS Medak Assembly Constituency: TS Election 2023: టికెట్‌ పోరు..‘నర్సాపూర్‌’పై కొనసాగుతున్న ఉత్కంఠ!
Sakshi News home page

TS Election 2023: టికెట్‌ పోరు..‘నర్సాపూర్‌’పై కొనసాగుతున్న ఉత్కంఠ!

Aug 25 2023 5:32 AM | Updated on Aug 25 2023 8:22 AM

- - Sakshi

మెదక్‌: బీఆర్‌ఎస్‌ నర్సాపూర్‌ నియోజకవర్గం అభ్యర్థిత్వంపై నెలకొన్న సస్పెన్స్‌ ఒకటెండ్రోజుల్లో వీడే అవకాశం ఉందన్న అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. నర్సాపూర్‌ అభ్యర్థిత్వాన్ని మాత్రం పార్టీ అధినేత కేసీఆర్‌ పెండింగ్‌లో పెట్టారు. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి ఈ టిక్కెట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

బుధవారం మెదక్‌లో ప్రగతి శంఖారావం బహిరంగ సభ జరిగిన మరుసటిరోజైన గురువారమే ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తన అనుచరులతో హైదరాబాద్‌ తరలివెళ్లి హరీశ్‌రావును కలిశారు. టిక్కెట్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేకే కేటాయించాలని మంత్రి నివాసం ముందు అనుచరులు బైఠాయించడం చర్చనీయాంశమైంది. దీంతో సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఆర్థిక శాఖ మంత్రి సముదాయించి పంపారు.

ఇప్పటికే ఇద్దరితో మాట్లాడిన అధినేత
మెదక్‌లో జరిగిన ప్రగతి శంఖారావం బహిరంగ సభ వేదికపై కేసీఆర్‌, మదన్‌రెడ్డితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆయన అడిగిన వెంటనే నర్సాపూర్‌కు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు సునీతా లక్ష్మారెడ్డి కూడా గురువారం మంత్రి హరీశ్‌రావును కలిసేందుకు హైదరాబాద్‌ తరలివెళ్లినట్లు తెలిసింది. అంతకు ముందే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశా రు. ఈనెల 21న బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా ప్రక టించక ముందే వీరిద్దరితో నర్సాపూర్‌ టిక్కెట్‌ విషయమై ముఖ్యమంత్రి మాట్లాడినట్లు సమాచారం.

ఇద్దరు కలిసే పార్టీ వ్యవహారాలు..
ప్రగతి శంఖారావం బహిరంగ సభకు కార్యకర్తలు, అనుచరులను తరలించే ప్రక్రియను మదన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఇద్దరు చేపట్టారు. ఏర్పాట్లు పర్యవేక్షణ కోసం నియోజకవర్గానికి ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి వీరితో చర్చించారు. అయితే బహిరంగ సభకు ముందు.. ఈనెల 14న మెదక్‌లో జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌ ఇద్దరూ హాజరుకావడంతో అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

అప్పుడే అభ్యర్థిత్వంపై కొంతమేరకు సంకేతాలు అందడంతోనే సునీతా లక్ష్మారెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారనే అభిప్రాయం శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మొత్తంగా ఈ నియోజకవర్గం అభ్యర్థిత్వం విషయంలో నెలకొన్న ఉత్కంఠ, రోజుకో పరిణామం ఆసక్తికరంగా మారుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement