అన్నివర్గాలను మోసం చేశారు
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి
మెదక్‌జోన్: అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ఆరోపించారు. గురువారం పట్టణంలోని 5, 7, 8, 9, 10 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు. లేనిచో ప్రజలను మోసం చేసి మళ్లీ ఓట్లు మాకే వేశారని మోసం చేస్తారని అన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ. 2,500, నిరుద్యోగ భృతి, పెన్షన్ల పెంపు ఏమైందన్నారు. కేసీఆర్ హయాంలో నిరంతరంగా 24 గంటలు విద్యుత్ సరఫరా చేశామని, ప్రస్తుతం 12 గంటలు కూడా సక్రమంగా రావడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలపై బీఆర్‌ఎస్ జెండా ఎగరటం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు అంజాగౌడ్, కిష్టయ్య, గట్టయ్య, షాకీర్ తదితరులు పాల్గొన్నారు.


