ఖర్చు మాది.. ఓటు మీది
మెదక్ కలెక్టరేట్: మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ఖర్చుకు వెనకాడటం లేదు. ప్రత్యర్థి పార్టీలపై పైచే యి సాధించాలన్న లక్ష్యంతో ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. మహిళలు, యువ ఓటర్లే టార్గెట్‌గా వ్యూహాలు రచిస్తున్నారు. సాయంత్రం వేళల్లో మందు పార్టీలు ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. కొన్ని వార్డుల్లో అభ్యర్థులు చికెన్, మటన్‌తో దావత్‌లు ఇస్తున్నట్లు తెలిసింది. కాగా ఇంటింటి ప్రచారానికి సైతం భారీగా ఖర్చు చేస్తున్నారు.
అభ్యర్థుల వెంటే నేతలు
మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి గురువారం ఉదయం నుంచి మెదక్ పట్టణంలోని పలు వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయగా, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యే రోహిత్‌రావు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ర్యాలీలు, కార్నర్ మీటింగ్‌లకు జనాన్ని భారీగా తరలించేలా అభ్యర్థులు చర్యలు తీసు కుంటున్నారు. ఇదిలాఉండగా పలు వార్డుల్లో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగానే ఉంది. మెదక్ మున్సిపాలిటీ పరిధిలో 32 వార్డులు ఉండగా, ఒక్క 27వ వార్డు అన్ రిజర్వ్‌డ్ జనరల్ మహిళకు కేటాయించారు. ఈ ఒక్క వార్డులోనే 7 మంది బరిలో ఉన్నారు. అయితే ఈ వార్డులో 90 శాతం ఎస్సీ జనాభా ఉన్నారు. దీంతో ఈ వార్డులో ఆరుగురు ఎస్సీ మహిళలు పోటీలో ఉండగా, ఒక మైనార్టీ మహిళా బరిలో ఉన్నారు.
మందు, విందులతో ఓటర్లకు గాలం
పోటాపోటీగా అభ్యర్థుల ఖర్చు
కళకళలాడుతున్న వార్డులు
అందరి చుట్టూ జనాలే.. ఓట్లెవరికో..
మెదక్ బల్దియా పరిధిలో 31 వార్డుల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ప్రతి అభ్యర్థి వెంట భారీ సంఖ్యలో జనాలు పాల్గొంటున్నారు. అన్నివార్డుల్లో ఆయా పార్టీల అభ్యర్థులు ఇంటింటి ప్రచారం జోరుగా చేస్తున్నారు. అయితే ప్రతి పార్టీ అభ్యర్థి వెంట తిరుగుతున్న ఓటర్లు చివరికి ఓటు ఎవరికి వస్తారో... ఎవరిని అందలం ఎక్కిస్తారోనని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ లెక్క తేలాలంటే ఈనెల 13 వరకు వేచి చూడాల్సిందేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


