ప్రసవం.. సుఖమయం

మెదక్‌ మాతాశిశు ఆరోగ్య కేంద్రం - Sakshi

తల్లీబిడ్డకు మెదక్‌ ఎంసీహెచ్‌ రక్ష

గణనీయంగా పెరిగిన ప్రసవాలు

వైద్యులను అభినందించిన మంత్రి హరీశ్‌రావు

మెదక్‌జోన్‌: ఈఏడాది జనవరిలో పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన దొడ్ల అనిత, ఇదే మండలం పొడ్చన్‌పల్లికి చెందిన పొచ్చ స్రవంతి, టేక్మాల్‌ మండలం శాబాద్‌ తండాకు చెందిన రామావత్‌ బుజ్జి కాన్పు కోసం మెదక్‌ ఎంసీహెచ్‌లో చేరారు. వీరు ముగ్గురు మొదటి కాన్పులో శస్త్రచికిత్స (సిజేరియన్‌) ద్వారా మొదటి బిడ్డకు జన్మనివ్వగా.. రెండో కాన్పులో సాధారణ ప్రసవాలతో బిడ్డలకు జన్మనిచ్చారు. మొదటి కాన్పులో సిజేరియన్‌ అయిందంటే ఆ తర్వాత కాన్పు సైతం అలాగే అవుతుంది అంటుంటారు. కానీ ఆ చరిత్రను మెదక్‌ వైద్యులు తిరగరాశారు.

మొదటి స్థానంలో మెదక్‌

● సాధారణ కాన్పులతో పాటు గత ఫిబ్రవరిలో జిల్లాలో 81 శాతం గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే పురుడు పోసుకున్నారు.

● ప్రసవాల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో మెదక్‌ నిలిచింది. ఫిబ్రవరి 26న మంత్రి హరీశ్‌రావు మెదక్‌ పర్యటనకు వచ్చిన సందర్భంగా వైద్యులను ఘనంగా సన్మానించారు.

● ఈసందర్భంగా ప్రభుత్వాసుపత్రిలో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌కు శంకుస్థాపన చేసిన ఆయన ఇదే తరహాలో పేదలకు వైద్య సేవలు అందించాలని సూచించారు.

● గతేడాది పిల్లికొటాల్‌ శివారులో మెదక్‌లో ఎంసీహెచ్‌ ఆస్పత్రిని సకల సౌకర్యాలతో నిర్మించిన నాటి నుంచి కాన్పులకు కేరాఫ్‌గా నిలుస్తుంది.

● కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన గర్భిణులు సైతం కాన్పు కోసం మెదక్‌ ఎంసీహెచ్‌కు వస్తున్నారు.

● మహిళలు వాడే శానిటరీ ప్యాడ్స్‌ను మరుగుదొడ్లు, మురికి కాలువల్లో పడేయడంతో అవి నీటి ప్రవాహనికి అడ్డుగా నిలిచి సమస్య ఉత్పన్నమయ్యేది.

● ఇటీవల ఆస్పత్రిలో శానిటరీ ప్యాడ్స్‌ బర్నర్‌ మిషన్‌ సైతం ఏర్పాటు చేశారు. మహిళలు వాడిన ప్యాడ్స్‌ను ఈ మిషన్‌ క్షణాల్లో బూడిద చేస్తుంది. ఉమ్మడి జిల్లాలోనే మిషన్‌ను మెదక్‌ ఎంసీహెచ్‌లో ఏర్పాటు చేశారు.

● ఈ ఏడాది ఫిబ్రవరిలో 81 శాతం కాన్పులు స్రభుత్వాసుపత్రుల్లో జరగగా 19 శాతం ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి.

● పేదలు, మధ్య తరగతి మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి కాన్పు అయ్యే వరకు ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అనంతరం కాన్పు కోసం ఎంసీహెచ్‌కు తీసుకెళ్తున్నారు.

● ప్రతి గర్భిణిని సాధారణ కాన్పు కోసమే ప్రయత్నించాలని.. తప్పని పరిస్థితుల్లో మాత్రమే శస్త్రచికిత్స చేయాలని మంత్రి హరీశ్‌రావు వైద్యులను ఆదేశించడంతో జిల్లాలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.

టార్గెట్‌ను మించి చేస్తున్నాం

మెదక్‌ ఎంసీహెచ్‌లో టార్గెట్‌ను మించి ప్రసవాలు చేస్తున్నాం. ఇక్కడికి జిల్లా మహిళలతో పాటు కామారెడ్డి జిల్లాలోని పలు మండలాలకు చెందిన గర్భిణులు సైతం ప్రసవం కోసం వస్తున్నారు. నెలకు 200 నుంచి 250 టార్గెట్‌ ఉండగా ఇక్కడ నెలకు 350 నుంచి నాలుగు వందలకు పైగా ప్రసవాలు చేస్తున్నాం. వీటిలో సాధారణ కాన్పుల కోసం నిరంతరం శ్రమిస్తున్నాం.

– డాక్టర్‌ చంద్రశేఖర్‌, డీసీహెచ్‌ఎస్‌

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top