ఇప్పటికీ ప్రారంభంకాని వరి కొనుగోలు కేంద్రాలు
దళారులకు విక్రయిస్తున్న రైతులు
ఆర్థికంగా నష్టపోతున్న అన్నదాతలు
చెన్నూర్‌రూరల్: ఖరీఫ్ వరి కోతలు ప్రారంభమై పదిహేను రోజులు కావస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వర్షాభావ పరిస్థితులతో పంటలకు సక్రమంగా నీరందక కొంతవరకు పంటలు ఎండి పోయినా అరకొరగా చేతికి వచ్చిన పంటను అమ్ముకుందామంటే ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు కోసిన వరిధాన్యాన్ని కళ్లాలు, కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 1.34 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంటలు సాగు చేశారు. జిల్లాలో మొత్తం 292 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావాల్సి ఉండగా కేవలం 18 మాత్రమే ప్రారంభం అయ్యాయి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక పోవడంతో రైతులు ధాన్యాన్ని దళారులకు విక్రయించి ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. చెన్నూర్ మండలంలోని ఆస్నాద, సోమనపల్లి, చాకెపల్లి, సుందరసాల, కత్తెరసాల, కిష్టంపేట, కొమ్మెర, పొక్కూరు, తదితర గ్రామాల్లో రైతులు ఎక్కువగా వరి పంటలు సాగు చేశారు. ఖరీఫ్ ప్రారంభం నుంచి వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు పంటను కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. పంటలకు నీరందించేందుకు పగలనకా, రాత్రనకా చెమటోడ్చారు. అయినప్పటికీ కొన్నిచోట్ల నీరందక పంటలు ఎండిపోయి రైతులు నష్టాలకు గురయ్యారు.
వర్షం కురిస్తే అంతే..
ఆస్నాద, ఒత్కులపల్లి, సోమనపల్లి, నాగాపూర్, పొక్కూరు, తదితర గ్రామాల్లో కొందరు రైతులు వరిధాన్యాన్ని కళ్లాలు, రోడ్లపైనే నిల్వ ఉంచారు. ఒకవేళ అనుకోకుండా వర్షం కురిస్తే ధాన్యం మొత్తం తడిసే పోయే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వర్షాభావ పరిస్ధితులు, తీవ్ర నష్టాలకు గురయ్యామని ఇ ప్పుడు వర్షం కురిస్తే చేతికొచ్చిన పంటను కూడా నష్ట పోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
మద్దతు ధర పెంచాలి
ఈ ఏడాలి వర్షాలు సక్రమంగా కురవక వరి పంటకు నీరు అందించ లేక పోయాం. కొంత వరకు పంటలు ఎండి పోయాయి. వరి కోతలు కోయిస్తున్నాం. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర పెంచాలి.
– మల్లేశ్, సుద్దాల, రైతు
కేంద్రాలు ప్రారంభించాలి
వరి పంటను కోసి కళ్లాల్లో ధాన్యం నిల్వ ఉంచాం. అనుకోకుండా వర్షం కురిస్తే తీవ్రంగా తీవ్రంగా నష్ట పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరగా ప్రారంభించాలి.
– గట్టయ్య, లింగంపెల్లి, రైతు


