మంచిర్యాలటౌన్: పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ వి. రాములు అన్నారు. శుక్రవారం మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతో పాటు, వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ రఫతుల్లా ఖాన్, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ అంశాల పురోగతిలో అలసత్వం వహించవద్దన్నారు. హైకోర్టు కేసులకు సంబంధించి సీసీఎంఎస్ స్థితిగతులు, ఏఎస్ డీడీ రోజువారి నివేదికల పరిష్కారం, భూభారతి పాత, కొత్త పెండింగ్ దరఖాస్తులు, జీవో 58, 59 కింద భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులు, భూదాన్ భూములు, మీసేవ ధృవీకరణ పత్రాల పెండింగ్, ప్రజావాణి ఫిర్యాదులను పరిశీలించి, వేగవంతంగా పరిష్కరించేలా చూడాలన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి
నస్పూర్: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ వి.రాములు అన్నారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో వానాకాలం 2026–27 ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లపై సంబందిత శాఖల అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్, జిల్లా పౌరసరఫరాల అధికారి వేణుగోపాల్, జిల్లా మేనేజర్ శ్రీకళ, సహకార అధికారి కరుణాకర్, డీసీఎంఎస్, మెప్మా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


