ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం
నేటి నుంచి గ్రామాలు, పట్టణాల్లో నమోదు ప్రక్రియ
రేషన్‌కార్డు ఉన్నా లేకున్నా అవకాశం
మంచిర్యాలటౌన్: రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశ పెడుతోంది. ఈ నెల 19నుంచి ప్రారంభం కానుండగా ఇదే రోజు నుంచి నమోదుకు అవకాశం కల్పించింది. జిల్లాలో 311 గ్రామ పంచాయతీలు, ఐదు మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నమోదు కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. మంచిర్యాల నగరంలో 60డివిజన్లు ఉండగా ఒకేసారి అన్ని అన్ని డివిజన్లలో నమోదు ప్రక్రియ ఇబ్బందిగా మారుతుందని, 1నుంచి 20డివిజన్లలో మొదటి మూడు రోజులు, 21నుంచి 40డివిజన్లలో ఆ తర్వాత మూడు రోజులు, 41నుంచి 60డివిజన్లలో మరో మూడు రోజులపాటు నమోదు ప్రక్రియ చేపడుతారు.
ఆదుకునేందుకు..
పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఇంటి పెద్ద అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ జీవిత బీమా అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద నమోదైన వ్యక్తి మరణిస్తే నామినీకి రూ.5లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. రేషన్‌కార్డు ఉన్నా లేకున్నా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి వర్తింపజేయనున్నారు. 18నుంచి 59ఏళ్లలోపు వారు అర్హులు కాగా.. ఆధార్‌కార్డులోని పుట్టిన తేదీ ఆధారంగా వయస్సును నిర్ధారించి జనగణనలో గుర్తించిన కుటుంబాల సంఖ్యకు అనుగుణంగా అమలు చేయనున్నారు. ఇప్పటికే నమోదుపై అన్ని గ్రామాలు, పట్టణాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రజలకు అవగాహన కల్పించగా గురువారం నుంచి నిర్వహించే ప్రత్యేక శిబిరాల్లో నమోదు ప్రక్రియ చేపడుతారు.
సమర్థవంతంగా అమలు చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: అర్హులైన ప్రతీ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీమా ప్రీమియం ప్రభుత్వం భరిస్తుందని, లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని అన్నారు. గ్రామాలు, పట్టణాలు, వార్డుల వారీగా ప్రత్యేక సహాయక నమోదు శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుల నమోదు, అవసరమైన సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో పథకం అమలుకు జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)ను నోడల్ అధికారిగా నియమించినట్లు చెప్పారు.
రేషన్‌కార్డు ఉన్నా.. లేకున్నా నమోదు
బీమా పథకానికి రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకోకుండా కార్డులు ఉన్నవారికి ఒక నమోదు సంఖ్య, లేని వారికి మరొక నమోదు సంఖ్య ఇవ్వనున్నారు. రేషన్‌కార్డుదారులకు దరఖాస్తు ఫారంలో రేషన్‌కార్డు సంఖ్య నమోదు చేస్తారు. రేషన్‌కార్డు లేనివారికి ప్రత్యేక కోడ్ కేటాయిస్తారు. ఇతర జిల్లాల్లో రేషన్‌కార్డులు ఉన్నా సరే ప్రస్తుతం ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడే నమోదుకు అవకాశం కల్పించారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి మాత్రమే బీమా వర్తింపజేసేందుకు అవకాశం ఉంది. ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలు ఉంటే వారికి రూ.5లక్షల్లో క్లెయిమ్ వాటాలు ఎలా వర్తింపజేయాలనే దానిపై నమోదు సమయంలోనే అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రత్యేక శిబిరాల్లోనే ఆన్‌లైన్‌లో అప్పటికప్పుడు ఇందిరమ్మ బీమా పథకంలో నమోదు చేయనుండగా వెంటనే బీమా అమల్లోకి రానుంది.
2011 జనాభా లెక్కల
ప్రకారం జిల్లా వివరాలు
జనాభా 8,07,037
గ్రామీణులు 4,40,481
పట్టణాల్లో 3,66,557
మొత్తం కుటుంబాలు 2,06,983


