మందమర్రిరూరల్: సింగరేణిలో కొందరు ఉద్యోగుల హాజరు అంతంత మాత్రంగా ఉంది. నెలకు కనీసం 15, ఏడాదిలో కనీసం 101 మస్టర్లు చేయకుండా గైర్హాజరవుతున్నారు. దీంతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. వీరిలో నాన్ ప్రొడక్షన్ వర్క్ సైడ్ అంటే జనరల్ అసిస్టెంట్లు, ట్రైనీ ఉద్యోగులే ఎక్కువ. మందమర్రి ఏరియాలో కేకే–5, కేకే–ఓసీ, కాసిపేట, కాసిపేట–2, శాంతిఖని గనులతోపాటు వర్క్‌షాపు, సివిల్, ఎస్‌అండ్ పీసీ, జీఎం ఆఫీస్, జీవీటీసీ తదతర విభాగాల్లో మొత్తం 4,500 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సుమారు 1350 పైచిలుకు మంది అంటే 30 శాతం వరకు విధులకు హాజరవడం లేదు. కేకే–5 గనిలో సుమారు 200, శాంతిఖనిలో 130, కాసిపేట గనిలో 351, కాసిపేట–2 గనిలో 276, కేకే–ఓసీలో 84 మంది ఉద్యోగులతోపాటు ఇతర విభాగాల్లో సంవత్సరంలో కనీసం 101 మస్టర్‌లైనా చేయకుండా సుమారు 250 పైచిలుకు మంది గైర్హాజరు అవుతున్నారు. అయితే గనుల, డిపార్ట్‌మెంట్ల సంక్షేమాధికారులు, గుర్తింపు కార్మిక సంఘం ప్రతినిధులు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సమావేశం నిర్వహించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
మూడు నెలల వరకు అవకాశం
ఒక ఉద్యోగి ఏడాదిలో 101 మస్టర్ల కంటే తక్కువగా ఉంటే గుర్తించి ముందుగాఅధికారులు నోటీసులు జారీ చేస్తారు. వారి పేర్లు గనిపై నోటీసు బోర్డుపై అంటించడం, రెస్పాండ్ కానివారికి న్యూస్ పేపర్ ప్రకటన ద్వారా సమాచారం తెలియజేస్తారు. అనంతరం వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో గుర్తింపు సంఘం నాయకుల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇస్తారు. ప్రతీనెల కనీసం 20 మస్టర్లు చేయాలని మూడు నెలల వరకు అవకాశం ఉంది. సద్వినియోగం చేసుకోకపోతే తాత్కాలికంగా ఇంక్రిమెంట్ కట్ చేయడం లాంటి చర్యలంటాయి. మూడు నుంచి ఐదేళ్ల వరకు గైర్హాజరు ఉద్యోగుల్లో మార్పు రాకపోతే క్రమశిక్షణలో భాగంగా చర్యలు తీసుకుంటారు.
పద్ధతి మార్చుకోవాలి
గైర్హాజరు ఉద్యోగులు పద్ధతి మార్చుకుని విధులకు హాజరుకావాలి. లేకపోతే ప్రతీనెల వేతనం, లాభాల్లో వాటా, బోనస్, జీతం, లీవ్, తదితర వెసలుబాటు కోల్పోయే అవకాశం ఉంది. గతంలో గైర్హాజరు పేరిట ఉద్యోగం కోల్పోయిన పరిస్థితి దయనీయంగా ఉంది. కుటుంబ బాధ్యతలు గుర్తుంచుకుని విధులకు హాజరుకావాలి.
– నీలజాల రాధాకృష్ణ, ఏరియా జీఎం మందమర్రి


