కెరమెరి: మండలంలోని కొత్తగూడ గ్రామానికి చెందిన దుర్వ శ్రీనివాస్ (40) పెద్దవాగులో కొట్టుకుపోయి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపి న వివరాల ప్రకారం.. శ్రీనివాస్ మండంలోని జోడేఘాట్ ఆశ్రమోన్నత పాఠశాలలో సీఆర్టీ వ్యాయామ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 24న ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో భారీ వర్షం కురవడంతో పెద్దవాగు ఉప్పొంగి ప్రవహించింది. రాత్రి కావడంతో తన వాహనాన్ని కెరమెరిలోని వాగుకు సమీపంలోగల షెడ్డులో ఉంచాడు. నీటి ప్రవాహం తెలియక వాగు దాటుతూ అందులో కొట్టుకుపోయినట్లు సమాచారం. రాత్రి 9గంటల వరకు ఫోన్‌లో మాట్లాడిన శ్రీనివాస్ ఆ తర్వాత అందుబాటులోకి రాకపోవడంతో కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు. ఆచూకీ దొరకకపోవడంతో పెద్దవాగులో కొట్టుకుపోయి ఉంటాడని అనుమానించారు. స్థానికులు పెద్దవాగులో గాలింపు చేపట్టగా నిసాని గ్రామ సమీపంలో మృతదేహం లభ్యమైంది. దీంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. శ్రీనివాస్‌కు భార్య భూదేవి, ముగ్గురు కొడుకులు, కూతురు ఉన్నారు. శ్రీనివాస్ మరణంతో కొత్తగూడలో విషాదం అలుముకుంది. కాగా, 2011లో శ్రీనివాస్ తండ్రి మెంగు కూడా పెద్దవాగులో కొట్టుకుపోయి మృతి చెందడం గమనార్హం.


