గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సమీపంలోని గోదావరి వంతెన సమీపంలో అంబులెన్స్, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. శనివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పవన్ అనే వ్యక్తిని మంచిర్యాల నుంచి వరంగల్‌లోని ఎంజీఎంకు అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నారు. గోదావరి వంతెన సమీపంలోకి రాగానే ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై ఎదురుగా అతివేగంగా వచ్చి అంబులెన్స్‌ను ఢీకొట్టారు. దీంతో అంబులెన్స్ అదుపుతప్పి బోల్తాపడింది. ఘటనలో అంబులెన్సు డ్రైవర్ సతీశ్, అంబులెన్స్‌లోని పవన్, సుధీర్, పవన్ తల్లి రమక్క, అక్క కవిత గాయపడ్డారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనరెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మరో అంబులెన్స్ రప్పించి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న మహిమొద్దీన్, ఎండీ పర్వేజ్ కూడా గాయపడ్డారు. అంబులెన్స్ ఓనర్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రాజశేఖర్ కేసు నమోదు చేసుకున్నారు. గాయపడ్డవారందరూ మంచిర్యాల జిల్లావాసులే.


