మంచిర్యాలఅగ్రికల్చర్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్న రకాల వడ్ల గుర్తింపునకు ప్రభుత్వం వలంటీర్లను నియమించాలని నిర్ణయించింది. సన్న రకాలకు కనీస మద్దతు ధర రూ.2,461, అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తోంది. వానాకాలం సాగుకు ముందుగా ప్రభుత్వం సూచించిన సన్న రకం ధాన్యానికి మాత్రమే బోనస్ చెల్లిస్తామని ప్రకటించింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రకం గుర్తింపు కోసం ప్రత్యేక వలంటీర్లను నియమించాలని వ్యవసాయ ఉత్పత్తుల శాఖ కమిషనర్ సురేంద్రమోహన్ ఇటీవల జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆదేశించారు. వ్యవసాయ పట్టభద్రులు, డిప్లొమా అర్హతలు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ప్రతీ కొనుగోలు కేంద్రానికి ఒకరు చొప్పున నియమించి నెలవారీగా గౌరవ భృతి చెల్లించి వారి సేవలను వినియోగించుకుంటారు. జిల్లాలో 3.20లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కాగా 1.44లక్షల ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం ఉంది. ఇందులో 90శాతం సన్నరకం వరి పంట ఉంది. 3.70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నా రు. రైతుల అవసరాలు, కంపెనీ విత్తనాలు పోను కొనుగోలు కేంద్రాలకు 1.70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని భావిస్తున్నారు. నవంబర్ మొద టి వారంలో ధాన్యం సేకరణ ప్రారంభమవుతుంది. 287కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు, గన్ని బ్యాగులు, తూకం యంత్రాలు, టార్పాలిన్లు, ఇతర మౌలి క సదుపాయాలు కల్పించాలని ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్, మెప్మా ఏజెన్సీల నిర్వాహకులకు అవగాహన కల్పించారు. కొనుగోలు కేంద్రాల్లోని సిబ్బంది, వలంటీర్లకు సూచనలు, శిక్షణ ఇస్తారు.
ఏడు రకాలకే బోనస్
జిల్లాలో సాధారణంగా వానాకాలంలో సన్న రకం, యాసంగిలో దొడ్డు రకాలు సాగు చేస్తుంటారు. సన్నాలకు మార్కెట్లో డిమాండ్ ఉండడంతో కొన్నేళ్లుగా ప్రభుత్వం సాగును ప్రోత్సహిస్తూ బోనస్ అందిస్తోంది. బోనస్ దుర్వినియోగం కాకుండా ఈ సీజన్ నుంచి వలంటీర్ల విధానాన్ని అమల్లోకి తెస్తోంది. సన్న రకం సాగు చేస్తున్న రైతులు విత్తనాల కొనుగోలు నుంచే టీ అగ్రి సీడ్స్ పోర్టల్‌లో నమోదు చేశారు. సొంత విత్తనాలు కొనుగోలు చేసిన వారు, పరిశోధన కేంద్రం నుంచి అందిన విత్తనాలు పొందిన రైతులు సంబంధిత ఏఈవోల ధ్రువీకరణ పత్రం అందించాల్సి ఉంటుంది. నాణ్యత, దిగుబడి, మార్కెట్‌లో డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ఏడు ప్రత్యేక రకాల సన్న వడ్లపై తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీంతో ఆ ఏడు రకాలకే క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో బీపీటీ–5204(సాంబ మ సూరి), ఆర్‌ఎన్‌ఆర్ 15048(తెలంగాణ సోన), జై శ్రీరాం, కేఎన్‌ఎం–1638(కూనారం సన్నాలు), డ బ్ల్యూజీఎల్–44(సిద్ది), కేఎన్‌ఎం–7715 ఉన్నా యి. నాణ్యత గింజ పొడువు 6 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉండాలి. పొడవు, వెడల్పు నిష్పత్తి 2ః5 కంటే ఎక్కువగా ఉండాలి. గింజ వెడల్పు 2 మిల్లీమీటర్లు మించి ఉండకూడదు. ఆయా ఏడు రకాల వడ్లనే కనీస మద్దతు ధరతోపాటు అదనంగా బోనస్ చెల్లించి కొనుగోలు చేస్తారు. ఏఈవోల వద్ద క్రాప్ బుకింగ్ పోర్టల్‌లో పంట వివరాలు నమోదు చేసుకుని ఉండాలి. సన్నరకం వడ్లు, నాణ్యత, ప్రమాణాల గుర్తింపులో వలంటీర్లు కీలకం కానున్నారు.


