జిల్లాలో 93శాతం బయోమెట్రిక్ పూర్తి
ఇంకా 16,764 మంది దూరం
లేదంటే మార్కెట్ ధరకే గ్యాస్
మంచిర్యాలటౌన్: గ్యాస్ సిలిండర్ కావాలంటే ఇక ఆధార్ బయోమెట్రిక్ ధ్రువీకరణ తప్పనిసరి. కానీ జిల్లాలో 16,764 మంది గ్యాస్ వినియోగదారులు ఆధార్ బయోమెట్రిక్ చేసుకోకపోవడంతో సబ్సిడీ సిలిండర్లకు దూరం కానున్నారు. కేంద్రం ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అథెంటికేషన్(బీఏఏ) పూర్తి చేయని కుటుంబాలకు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్‌ను సబ్సిడీతో అందించే విధానానికి బ్రేక్ వేయాలని నిర్ణయించింది. బీఏఏ పూర్తయ్యే వరకు సబ్సిడీ రీఫిల్ బుక్ చేసుకునే అవకాశం ఉండదు. సబ్సిడీ నిలిపివేయనుండగా.. కనెక్షన్‌ను రద్దు, గ్యాస్ పూర్తిగా నిలిపి వేయడం గానీ చేయరు. బీఏఏ పూర్తి చేసిన తర్వాతనే 14.2 కిలోల సబ్సిడీ రీఫిల్ సౌకర్యం పునరుద్ధరిస్తారు. జిల్లాలో గ్యాస్ వినియోగదారులు 2,42,102 మంది ఉండగా.. 2,25,338 మంది ఆధార్ బయోమెట్రిక్ చేసుకున్నారు. ఇంకా చేసుకోవాల్సిన వారు 16,764 మంది ఉన్నారు.
తప్పనిసరి
గ్యాస్ కనెక్షన్ ఉన్న వారు వారి ఆధార్ వివరాలను వేలిముద్ర, ముఖ గుర్తింపు వంటి బయోమెట్రిక్ ద్వారా ధ్రువీకరించుకోవాలి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై), నాన్ పీఎంయూవై వినియోగదారులు ఎవరైనా బయోమెట్రిక్‌ను ధ్రువీకరించుకోవాలి. నిజమైన వినియోగదారుడిదేనని ఆధార్‌తో నిర్ధారించే పక్రియ కోసం ఈ ఏడాది జూన్ 30వరకు గడువు నిర్ణయించగా, ఆ తర్వాత పలుమార్లు పొడిగిస్తూ ఈ నెల 14వరకు అవకాశం కల్పించారు. గడువు ముగిసినా బీఏఏ చేసుకునే అవకాశాన్ని వినియోగదారులు వినియోగించుకోవచ్చు. పెండింగ్‌లో ఉన్న వినియోగదారులు బీఏఏ పూర్తి చేసుకునేందుకు నిర్ధిష్ట గడువు లేకుండానే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి బీఏఏ చేసుకోని వారికి సబ్సిడీ నిలిపివేయనున్నారు. దీనివల్ల సబ్సిడీ సిలిండర్ నియంత్రిత ధరకు బుక్ చేసుకునే అవకాశం ఉండదు. గ్యాస్ అవసరం ఉన్నవారు ఆయిల్ కంపెనీల లభ్యతను బట్టి 5, 10 కేజీల సిలిండర్లను మార్కెట్ ధరకు తీసుకునేందుకు అవకాశం ఉండగా, వీటికి సబ్సిడీ వర్తించదు.
మొబైల్ యాప్ ద్వారా చేసుకోవచ్చు
గ్యాస్ కనెక్షన్ వినియోగదారులు వారి ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్‌ను నేరుగా గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లి చేసుకోవడంతోపాటు గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలోనే డెలివరీ సిబ్బంది, ఆయిల్ కంపెనీల మొబైల్ యాప్‌ల ద్వారా చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇండేన్, భారత్, హెచ్‌పీ గ్యాస్ సంస్థలు డిజిటల్ మార్గాలను అందుబాటులో ఉంచాయి.


