మంచిర్యాలటౌన్: చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ఏటా పోషణ మాసోత్సవం నిర్వహిస్తోంది. ఈ నెల 9 నుంచి అక్టోబర్ 8వరకు మహిళా శిశు, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ మాసోత్సవం మొక్కుబడిగా సాగుతోంది. గర్భిణుల ఆరోగ్య రక్షణ, రక్తహీనత నివారణ, పిల్లల పెరుగుదల పర్యవేక్షణ, పరిశుభ్రత వంటి పలు అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నెలంతా అన్ని అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో నిర్వహించాలి. కానీ ఏదో ఒక రోజు నిర్వహిస్తూ మమ అనిపిస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పోషకాహారంపై సరైన అవగాహన లేక, పేదరికం కారణంగా ఎంతోమంది పౌష్టికాహార లోపంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. అంగన్‌వాడీ టీచర్లకు బీఎల్‌వోలుగా అదనపు విధులు కేటాయించారు. ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ(సర్) కార్యక్రమంలోనే బిజీగా ఉండడంతో అంగన్‌వాడీ కేంద్రాలకు రెండు నెలలకు పైగా రావడం లేదు. దీంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం ఇవ్వలేని పరిస్థితులు ఉండగా.. పోషణ మాసోత్సవాలు నిర్వహించలేని పరిస్థితి ఎదురవుతోంది.
చిన్నారుల్లో పోషకాహార లోపాలు
జిల్లాలోని 975 అంగన్‌వాడీ కేంద్రాల్లో 35,537మంది చిన్నారులు, గర్భిణులు 3,649మంది, బాలింతలు 2,961 మంది ఉన్నారు. చిన్నారుల్లో తీవ్ర పోషకాహార లోపం ఉన్నవారు 1,175 మంది కాగా అతి తీవ్ర పోషకాహార లోపం ఉన్నవారు 276 మంది ఉన్నారని గత నెలలో గుర్తించారు. మాసోత్సవంలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల భాగస్వామ్యంతోనే అవగాహన కల్పించి, పిల్లల ఎత్తు, బరువు కొలతలు సేకరించడం, గర్భిణుల బరువు, భుజం కొలతలను తీసుకోవడం, పోషకాహారంపై అవగాహన కల్పించి, రోగ నిరోధక శక్తిని పెంచడం వంటివి చేపడుతున్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపాలను గుర్తించి, తక్కువ బరువు ఉన్న పిల్లలకు వైద్య పరీక్షలు, మందులు, బాలామృతం, బాలామృతం ప్లస్ పంపిణీ చేసి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి.
చిన్నారుల్లో గ్రోత్ మానిటరింగ్ వివరాలు
ప్రాజెక్టు చిన్నారులు తీవ్ర పోషకాహార అతి తీవ్ర
లోపం పోషకాహార లోపం
బెల్లంపల్లి 9,578 369 85
చెన్నూర్ 8,078 244 72
లక్సెట్టిపేట్ 6,104 221 54
మంచిర్యాల 11,777 341 65
మొత్తం 35,537 1,175 276


