మందగించిన ‘హరిత’ వేగం..! | - | Sakshi
Sakshi News home page

మందగించిన ‘హరిత’ వేగం..!

Sep 25 2026 2:05 AM | Updated on Sep 25 2026 2:05 AM

● నేటితో ముగియనున్న ఏక్‌పేడ్‌ మాకేనామ్‌ గడువు ● రాష్ట్రంలోనే చివరి స్థానంలో ఆదిలాబాద్‌ ● 14వ స్థానంలో మంచిర్యాల

మంచిర్యాలఅర్బన్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఏక్‌పేడ్‌ మాకే నామ్‌ కార్యక్రమం అమలు మందకొడిగా సాగుతోంది. ఎల్‌నినో ప్రభావం, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు విస్తృతంగా నాటేందుకు విద్యార్థులను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. విద్యార్థి దశనుంచే పర్యావరణ పరిరక్షణపై ఆసక్తి పెంచేందుకు ప్రభుత్వం ఏక్‌పేడ్‌ మాకేనామ్‌ (అమ్మ పేరుతో మొక్క) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ సమగ్ర శిక్షా విభాగం పరిధిలో మిషన్‌ లైప్‌–ఏకో క్లబ్స్‌ ద్వారా 3.0 పేరిట మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. సెప్టెంబర్‌ 23 వరకు పురోగతి సాధించకపోవడంతో మరో రెండు రోజులు గడువు పొడగించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 4.32 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించగా 26,464 మొక్కలు మాత్రమే నాటారు. అధికారుల పర్యవేక్షణ లోపం, అవగాహన లోపంతో హరిత వేగం మందగించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోనే ఆదిలాబాద్‌ జిల్లా చివరి స్థానం(33)లో నిలవడం నిరాశజనకంగా మారింది. పొడగించిన సమయం శుక్రవారంతో ముగియనుండటంతో నిర్దేశిత లక్ష్యం సాధించేందుకు అధికారులు నిమగ్నమయ్యారు.

అమ్మపేరిట మొక్క నాటడం..

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 2024 జూన్‌ 25న తల్లి పేరు మీద మొక్కను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ భూమిపై ఆకుపచ్చదనాన్ని పెంచటం, ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరు మీద మొక్కను నాటడం కార్యక్రమ ఉద్దేశం. ఇందులో భాగంగా తెలంగాణ సమగ్ర శిక్షా విభాగం మిషన్‌లైప్‌–ఏకో క్లబ్స్‌ ద్వారా ఏక్‌పేడ్‌ మాకే నామ్‌ 3.0 పేరిట మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఈవో, సీఆర్‌పీలు, ఏకోక్లబ్‌ ఇన్‌చార్జీ ఉపాధ్యాయులు, ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లు, ఇతర సిబ్బందికి బాధ్యతలు కేటాయించారు. నాటిన మొక్కల వివరాలు జియోట్యాగ్‌ చేసిన ఫొ టోలను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉన్నా పర్యవేక్షణ, ప్రచార లోపంతో వెనక‘బడి’ పోయింది.

14వ స్థానంలో మంచిర్యాల

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రాష్ట్రంలోనే ఆదిలాబాద్‌ చివరి స్థానం (0.7శాాతం), మంచిర్యాల 14వ స్థానంలో ముందు వరుసలో నిలిచింది. ఆదిలాబాద్‌ జిల్లాలో 1,31,716 లక్ష్యం కాగా కేవలం 917 మొక్కలు మాత్రమే నాటారు. నిర్మల్‌లో 95.541 లక్ష్యానికి గానూ కేవలం 2,327 మొక్కలు నాటి (2.4శాతం) 32వ ర్యాంకు సాధించింది. కుమురంభీం ఆసిఫాబాద్‌లో 1,08,857 లక్ష్యం కాగా కేవలం 7,071 మొక్కలు నాటి (29 వర్యాంకు) 6.5శాతం ప్రగతితో అట్టడుగు స్థానాల్లో నిలిచింది. మంచిర్యాలలో 95,649 లక్ష్యానికి గానూ 16,149 మొక్కలు నాటి 14వస్థానంలో నిలిచింది. ఉమ్మడి జిల్లాలోనే మంచిర్యాల ముందు వరుసలో నిలవగా టాప్‌–10 జాబితాలోకి చేరుకునే అవకాశం ఉంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement