మిల్లుల కేటాయింపునకు ప్రభుత్వం నిరాకరణ
గోదాముల్లో నిల్వలకు ప్రణాళిక
సరిపడా లేని గోదాములు
తహసీల్దార్లకు స్థలాల ఎంపిక బాధ్యత
మంచిర్యాలఅగ్రికల్చర్: వానాకాలం వరి ధాన్యం సేకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సీజన్‌లో ధాన్యం మిల్లర్లకు ఇవ్వరాదని నిర్ణయించింది. ధాన్యం నిల్వకు ప్రభుత్వ, ప్రైవేటు గోదాములు, ఇతర ఫంక్షన్‌హాళ్లు ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో జిల్లా అదనపు కలెక్టర్ రాములు అధికారులతో సమీక్షించి గోదాములు, ఇతర స్థలాలు గుర్తించాలని తహసీల్దార్లను ఆదేశించారు. జిల్లాలో 1.40లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 1.70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు 40వేల మెట్రిక్ టన్నుల వరకు నిల్వ చేసేందుకు గోదాములు అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. ధాన్యం సేకరణకు అనుగుణంగా నిల్వ చేసేందుకు అనువైన ప్రభుత్వ, ప్రైవేటు గోదాములు, ఫంక్షన్‌హాళ్లు, ఇతరత్రా స్థలాలు గుర్తించే పనిలో పౌరసరఫరాల శాఖ అధికారులు ఉన్నారు. నిల్వలకు స్థలాలను ఎంపిక చేసి యాప్‌లో నమోదు చేయనున్నారు. రబీలో మార్క్‌ఫెడ్ రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ చేసింది. నెల రోజుల్లోనే వాటిని తీసేసి ఆ గోదాముల్లో ధాన్యం నిల్వకు ఏర్పాట్లు చేయనున్నారు.
సొమ్ము చేసుకుంటున్న మిల్లర్లు
గత కొన్నేళ్లుగా ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగిస్తోంది. పౌరసరఫరాల సంస్థ రూ.వేల కోట్లు అప్పులు చేసి ఏటా వడ్డీ చెల్లిస్తోంది. సేకరించిన లక్షల టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) కింద రైస్‌మిల్లర్లకు నయాపైసా పెట్టుబడి లేకుండా అప్పగిస్తోంది. మరాడించి బియ్యాన్ని సంస్థకు సకాలంలో అప్పగించకుండా మిల్లర్లు దర్జాగా వ్యాపారం చేస్తూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించి, గడువు మీద గడువు ఇస్తూ వెళ్లడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ధాన్యం పక్కదారి పట్టించారు. జిల్లాలో 67 రా రైస్, బాయి ల్డ్ రైస్‌మిల్లులు ఉండగా.. ధాన్యం కేటాయించి తిరిగి ఇవ్వని 23 మిల్లులపై కేసులు నమోదు చేశా రు. మరికొన్నింటిని డిఫాల్ట్ జాబితాలో చేర్చారు. గత కొన్ని సీజన్లకు సంబంధించిన ధాన్యం రూ.కో ట్లు బకాయిలు పెండింగ్ ఉన్నాయి. పలుమార్లు గడువు పొడిగించినా, బ్లాక్‌లిస్టులో పెట్టినా, నోటీసులు జారీ చేస్తున్నా, జరిమానా విధిస్తున్నా మిల్ల ర్లు మారడం లేదు. ఏవేవో కారణాలు చూపిస్తూ రెండు మూడు సీజన్లు దాటినా ధాన్యానికి సంబంధించిన బియ్యం వెనక్కి ఇవ్వడం లేదు. కొందరు మిల్లర్లు నేరుగా విక్రయించుకోగా, మరికొందరు మరాడించి బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇలా ఒక్కో రైస్‌మిల్లు నుంచి వేలాది క్వింటాళ్ల ధాన్యం మాయం చేస్తూ ఆ లోటును భర్తీ చేసేందుకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేసి సీఎంఆర్ కింద ఇస్తున్నట్లు తెలుస్తోంది. మిల్లర్లు బియ్యాన్ని ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖకు అప్పగించే వ్యవహారంలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. మిల్లర్లు పెద్దయెత్తున ధాన్యం పక్కదారి పట్టించి ఆర్జిస్తున్నారని, ప్రభుత్వానికి వాయిదాల పద్ధతిలో కొంత చెల్లిస్తున్నారనే ఆరపణలున్నాయి. ఇటీవల మిల్లుల్లో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీలతో లోపాలు బహిర్గతం అయ్యా యి. ఈసారి ధాన్యాన్ని మిల్లర్లకు ఇవ్వొద్దని ఎక్కడికక్కడే నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జిల్లాలో ఈ వానాకాలం 1.40లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, రైతుల అవసరాలు, విత్తన కంపెనీలకు పోను 1.70 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పీఏసీఎస్, ఐకేపీ, డీసీఎంఎస్, మెప్మా ఏజెన్సీల ఆధ్వర్యంలో 287 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, ధాన్యం నిల్వకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గతంలో కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలించగా మిల్లర్ల అక్రమాల నేపథ్యంలో కేటాయింపునకు ప్రభుత్వం నిరాకరించింది. జిల్లాలోని చెన్నూర్, భీమారం, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు గోదాముల్లో నిల్వకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్‌డబ్ల్యూసీ(స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్), పీఏసీఎస్ సహా ప్రభుత్వ రంగంలోని 30వేల నుంచి 40వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన పలు గోదాములను గుర్తించారు. ఇంకా లక్ష మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం నిల్వకు ఫంక్షన్‌హాళ్లు, అవసరం మేరకు క్యాప్ గోదాములు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఖా ళీ స్థలంలో ధాన్యం బస్తాలు ఎత్తుగా పేర్చి వర్షానికి తడవకుండా, గాలి తగలకుండా ప్లాస్టిక్ టార్పాలిన్‌తో కప్పేస్తారు. ఈ స్థలాల ఎంపికను మండలాల వారీగా తహసీల్దార్లకు అప్పగించారు. ఎస్‌డబ్ల్యూసీ అధికారులు నిల్వల భద్రతను పర్యవేక్షిస్తారు.


