బెల్లంపల్లి: అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం.. 34 వార్డులు.. 56 వేలకు పైగా జనాభా కలిగి ఉన్న బెల్లంపల్లి మున్సిపాలిటీలో ద్విచక్ర వాహనాలకు కనీసం పార్కింగ్ స్థలం కూడా లేక వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీ ఏర్పడి 39 ఏళ్లు కావస్తున్నా నేటికీ పార్కింగ్ సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఏళ్లు గడుస్తున్నా, ఎంతోమంది అధికారులు, ప్రజా ప్రతి నిధులు మారుతున్నా సమస్య మాత్రం పరిష్కారం కాకుండా అలాగే ఉండిపోతోంది.
రోడ్డే పార్కింగ్ స్థలం..
చుట్టుపక్కల మండలాల నుంచి బెల్లంపల్లికి ప్రతీరోజు వేలాదిమంది రాకపోకలు సాగిస్తారు. తాండూర్, కాసిపేట, భీమిని, కన్నెపల్లి, నెన్నెల, వేమనపల్లి, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం, తిర్యాణి, రెబ్బెన, బెల్లంపల్లి గ్రామీణ ప్రాంతాల నుంచి వందలాది మంది రోజువారీ పనులు, షాపింగ్, ఆసుపత్రులు, మార్కెట్ కోసం, ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం బెల్లంపల్లికి రాకపోకలు సాగిస్తుంటారు. వీరితో పాటు బెల్లంపల్లి పుర ప్రజలకు బజారు ఏరియా ప్రాంతం ఎంతో ముఖ్యమైనది. గ్రామీణ ప్రాంతాలు, పుర ప్రజల వాహనాలతో బజారు ఏరియా, బీఆర్ అంబేడ్కర్ (కాంటా) చౌరస్తా, పాత బస్టాండ్ ఏరియా ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ద్విచక్ర వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో రోడ్డు మీదనే బైక్‌లను పార్కింగ్ చేయడం ఏళ్ల తరబడి నుంచి ఆనవాయితీగా వస్తోంది. రోడ్డుమీద, ఫుట్‌పాత్‌పై బైక్‌లు పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి.
రోడ్డు మీదకొచ్చిన వ్యాపారం ...
కాంటా చౌరస్తా కల్వర్టు వద్ద నుంచి పాతబస్టాండ్ చౌరస్తా వరకు రోడ్డుకు ఇరువైపులా షాపులు ఉన్నాయి. నిబంధనల ప్రకారం షాపులన్నీ మురుగునీటి కాలువ అవతలి వైపు ఉండాల్సి ఉండగా షాపుల నిర్వాహకులు కాలువ దాటి రోడ్డు వరకు షాపులను విస్తరించారు. మరికొందరు షాపుల ముందున్న ఖాళీ స్థలాన్ని ఫుట్‌పాత్ వ్యాపారులకు అద్దెకు ఇచ్చి ఎంచక్కా సొమ్ము చేసుకుంటున్నారు.
పోలీసుల చలాన్లు..
రోడ్డు మీద, ఫుట్‌పాత్‌పై పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలకు పోలీసులు చలాన్లు విధిస్తున్నారు. పార్కింగ్ చేసిన బైక్ ఫోటో తీసి వాహనదారుడికి ఆన్‌లైన్‌లో సమాచారం పంపించడం సర్వసాధారణంగా మారింది. బజారు ఏరియాలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేస్తే మేమెందుకు రోడ్డుమీద, ఫుట్‌పాత్‌పై బైక్ పార్కింగ్ చేస్తామని వాహనదారులు అంటున్నారు. పార్కింగ్ స్థలాల ఏర్పాటు విషయంలో మౌనం వహిస్తున్న అధికారులు ఫైన్ విధించడానికి ఎగబడి బైక్‌ల ఫొటోలు తీయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
పరిష్కారం ఏమిటి?
మున్సిపాలిటీలో పార్కింగ్ సమస్య తీర్చడానికి పాలకవర్గం, మున్సిపల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. బజారు ఏరియాలో అన్ని వాణిజ్య సముదాయాల వద్ద తప్పనిసరిగా పార్కింగ్ స్థలం ఉండేలా చర్యలు తీసుకోవాలి. కాంటా చౌరస్తా, పాత బస్టాండ్ ఏరియాలో రోడ్డు మీదకు విస్తరించిన షాపులను తొలగించి ఆస్థానంలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలి. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేశ్‌ను ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా స్పందించలేదు.


