● ప్రజలను మోసం చేస్తున్న బీఆర్‌ఎస్ ● రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి
జైపూర్: చెన్నూర్ నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి పెట్టపీట వేస్తూ వసతిగృహాలు, తరగతి గదులు, కళాశాల భవనాలు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి తెలిపారు. మండల కేంద్రంలో రూ.1.81కోట్లతో ఎస్సీ సంక్షేమ వసతిగృహ భవనానికి గురువారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సోమనపల్లిలో రూ.200కోట్లతో 2,500మంది విద్యార్థులకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మించనున్నట్లు తెలిపారు. చెన్నూర్‌లో నిర్మించిన 100పడకల ఆస్పత్రి ప్రజలకు చాలా ఉపయోగకరంగా మారుతుందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించా రు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, సర్పంచ్ కూన భాస్కర్, డీసీసీ ఉపాధ్యక్షుడు రిక్కుల శ్రీనివాస్‌రెడ్డి, మండల అధ్యక్షుడు చల్ల విశ్వంభర్‌రెడ్డి పాల్గొన్నారు.
మందమర్రిలో 50 పడకల ఆసుపత్రి
మందమర్రిరూరల్: మందమర్రి పట్టణంలో 50 పడకల ఆసుపత్రి, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఏర్పాటు శుభవార్త త్వరలోనే చెబుతానని మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు. ఆసుపత్రి, ఇందిరమ్మ ఇళ్ల ఏర్పాటు కోసం సీఎండీతో చర్చించగా అంగీకరించినట్లు తెలిపారు. సింగరేణికి కేటాయించిన భూమిలో 25 ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవకాశం ఉంటుందని తెలిపారు. గురువారం మార్కెట్‌లోని వినాయకుడి వద్ద లడ్డు వేలం పాట, పట్టణంలోని మండపాల్లో సన్మాన కార్యక్రమానికి ఏరియా జీఎం రాధాకృష్ణతో కలిసి హాజరయ్యారు. లడ్డును వెంకటేశం అనే వ్యక్తి రూ.లక్షా 116కు వేలంలో దక్కించుకున్నాడు.
జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్
పోటీలకు ఎంపిక
బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సీవోఈ పాఠశాల విద్యార్థి జాతీ య స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. తొమ్మిదో తరగతి విద్యార్థి గజ్జల సుశాంత్ బెల్లంపల్లిలోని తిలక్‌స్టేడియంలో ఈ నెల 11, 12న నిర్వహించిన 11వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో సత్తాచాటాడు. మహారాష్ట్ర రాష్ట్రంలోని ఔరంగాబాద్‌లో ఈ నెల 25 నుంచి 27 వరకు జరిగే పోటీల్లో పాల్గొంటాడు. గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పోశన్న, కిరణ్, ప్రిన్సిపాల్ ఆకిడి విజయ్‌సాగర్ విద్యార్థిని అభినందించారు.


