మంచిర్యాలఅర్బన్/మంచిర్యాలరూరల్(హాజీపూర్): నవరాత్రులు పూజలందుకున్న గణనాథుడి శోభాయాత్ర బుధవారం వైభవంగా సాగింది. డప్పు వాయిద్యాల మధ్య వీడ్కోలు సంబరం అంబరాన్నంటింది. ఇందారం గోదావరి నది వద్ద, రాయపట్నం సమీపంలో గోదావరిలో వినాయకులను నిమజ్జనం చేశారు. మంచిర్యాల డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో వినాయకుడి శోభాయాత్ర, నిమజ్జన వేడుకలు బుధవారం రాత్రి నిర్వహించారు. గణేశ్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లోని గోదావరి నదిలోకి మూడు గేట్లు ఎత్తి ఐదు వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 20.175టీఎంసీలకు గాను 18.585 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 3వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. హైదరాబాద్‌కు 238, ఎన్టీపీసీకీకి 131 క్యూసెక్కుల నీరు తరలిస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ పి.రవీంద్రచారీ సూచించారు.


