ఫీజులకు సరే.. లెక్కలు అడిగితే కుంటిసాకులు
ప్రైవేటు విద్యాసంస్థల్లో నిబంధనల ఉల్లంఘన
మూడేళ్లుగా ఎవరికీ పట్టని లెక్కలు
ఫీజుల వివరాలు చెప్పాలని ఆదేశాలు
పోర్టల్‌లో ఆడిట్ నమోదుపై డీఈవో ప్రత్యేక దృష్టి
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో ఆదాయ, వ్యయ ఆడిట్ నివేదికలు, వార్షిక ట్యూషన్ ఫీజుల వివరాల నమోదులో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు దాగుడు మూతలు ఆడుతున్నాయి. ఆన్‌లైన్ పోర్టల్‌లో పారదర్శకంగా అప్‌లోడ్ చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినా మెజారిటీ యాజమాన్యాలు లెక్కచేయడం లేదు. ఇంతకాలం ఫీజులు, ఆడిట్‌పై ఎవరూ పట్టించుకోకపోవడంతో యాజమాన్యాలు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించాయి. పరిస్థితి తీవ్రతను గుర్తించిన జిల్లా విద్యాశాఖ అధికారి ఫీజుల వివరాలు కచ్చితంగా వెల్లడించాలని ఆదేశించడంతో జిల్లాలో 2026–27 విద్యాసంవత్సరానికి గాను 237 ప్రైవేటు పాఠశాలల్లో 145 పాఠశాలలు ఫీజు వివరాలు నమో దు చేశారు. ఇంకా 92 స్కూళ్లు నమోదు చేయాల్సి ఉంది. వార్షిక ఆదాయ, వ్యయాల సమర్పణలో 2023–24, 25, 26 సంవత్సరాలకు సంబంధించి 80 వరకు పాఠశాలలు ఆన్‌లైన్ నివేదికలు సమర్పించినట్లు తెలుస్తోంది. నమోదులో సాంకేతిక లొసుగులు చూపుతూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. నివేదికలు ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అంతులేని జాప్యం
జిల్లాలో ప్రైవేటు ఎయిడెడ్ రహిత పాఠశాలల యాజమాన్యాలు వార్షిక పరిపాలన నివేదికలతోపాటు ఆడిట్ చేసిన లెక్కల పత్రాలు, ఫీజుల వివరాలు సకాలంలో సమర్పించాలని డీఈవో ఆదేశించారు. 2023–24, 2024–25, 2025–26లో ఆడిట్ లెక్కలను చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ)తో ఆడిట్ చేసి నివేదికను జూలై 30 నాటికి సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2026–27 విద్యాసంవత్సరంలో తరగతుల వారీగా నిర్ణయించిన ఫీజుల వివరాలను పాఠశాల నోటీసుబోర్డుపై ప్రదర్శించాల్సి ఉంటుంది. ఫీజులు, ఆడిట్, ఆదాయ లెక్కలు ఐఎస్‌ఎంఎస్(ఇంటిగ్రేటెడ్ స్కూల్ మేనేజ్‌మెంటు సిస్టమ్) పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడంతోపాటు ఈమెయిల్ ఐడీకి పంపించాలి. నిబంధనలు పాటించని పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఫీజుల వివరాలపై వేగం పెంచినా ఆదాయ, వ్యయాలకు సాంకేతిక లోపాలు ఎత్తి చూపుతున్నారు.
నమోదులో వేగవంతం
మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రైవేట్ పాఠశాలల ఆదాయ, వ్యయాల వివరాల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాం. యాజమాన్యం, ఎంఈవోలతో సమావేశం ఏర్పాటు చేసి పోర్టల్ నమోదు చేయాలని ఆదేశించాం. ఫీజుల వివరాల నమోదు ప్రక్రియ వేగవంతం చేశాం. ఇప్పటికే సగానికి పైగా పాఠశాలలు ఫీజుల వివరాలు నమోదయ్యాయి. ఎప్పటికప్పుడు సాంకేతిక లోపాలను పరిష్కరిస్తున్నాం.
– జిల్లా అదనపు కలెక్టర్, డీఈవో చంద్రయ్య
గోప్యత వెనుక కారణాలెన్నో..?
లాగిన్ సమస్యల పేరిట ఆడిట్ వివరాలు గోప్యంగా ఉంచడం చర్చనీయాంశంగా మారింది. ట్యూషన్ ఫీజులు, డొనేషన్లు, ఇతర రుసుముల పేరిట తల్లిదండ్రుల నుంచి భారీగా వసూలు చేస్తున్న మొత్తాలను అధికారికంగా చూపించలేక యాజమాన్యాలు ఆడిట్ నివేదికలను తొక్కి పెడుతున్నాయనే ఆరోపణలున్నాయి. అర్హత కలిగిన టీచర్లకు పెద్దమొత్తంలో జీతాలు ఇస్తున్నట్లు రికార్డుల్లో చూపిస్తూ తక్కువ చెల్లిస్తున్నారనే విమర్శలున్నాయి. కొన్ని పాఠశాలల్లో ఆడిట్ పూర్తికాకపోవడం, రికార్డుల నమోదులో జాప్యం జరగడం వల్ల సమర్పణ ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది.


