మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఉండేలా యూనిఫామ్, షూస్ పంపిణీ చేసిన ప్రభుత్వం టై, బెల్ట్‌లు, ఐడీ కార్డులు పంపిణీ చేయనుంది. ఇందులో భాగంగా టైలు, బెల్టులు సామగ్రి బుధవారం మంచిర్యాల ఎమ్మార్సీకి చేరింది. ప్రభుత్వ, పాఠశాలల, కళాశాలలు, హాస్టళ్ల విద్యార్థుల కోసం తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్(టీఎస్‌ఎల్‌ఐపీసీ) ద్వారా బెల్టులు, టైలు చేరాయి. బెల్టులు 6,766, టైలు 1,760, ఐడీ కార్డు హోల్డర్లు 4446 ఎమ్మార్సీలకు చేరగా త్వరలోనే విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కేజీబీవీలు, సాంఘిక, వెనకబడిన తరగతులతోపాటు గిరిజన సంక్షేమ హాస్టళ్లకు అందజేయనున్నారు.


