మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) భవనం శిథిలావస్థకు చేరింది. గోడలు పగుళ్లు రాగా వర్షపు నీటితో తడి ఏర్పడుతోంది. గోడను ఆనుకుని ఉన్న విద్యుత్ వైర్లు వర్షపు నీటితో తడిస్తే ప్రమాదకరంగా మారుతుంది. విద్యుత్ కనెక్షన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో నలుగురు ఎలక్ట్రీషియన్లు పని చేస్తుండగా విద్యుత్ సమస్యలో లోపాలను ఎప్పటికప్పుడు సరి చేస్తున్నారు. రెండు ఆస్పత్రులకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటు మ్యాప్‌లు లేవు. ఆయా భవనాల విద్యుత్ కనెక్షన్లు ఇచ్చిన విధానంపై ప్రస్తుత ఎలక్ట్రీషియన్లకు అవగాహన లేక మరమ్మతు సమయంలో కొంత ఇబ్బంది ఏర్పడుతోంది. ఏసీల మరమ్మతులు, నిర్వహణకు టెక్నీషియన్‌ను నియమించారు. విద్యుత్ వ్యస్థ సక్రమంగా లేకపోవడం, గోడలు శిథిలావస్థకు చేరడం వల్ల విద్యుత్ కనెక్షన్లు అస్తవ్యస్తంగా మారి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని రోగులు ఆందోళన చెందుతున్నారు. గోడలు నీటితో తడవడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంది.
ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌తోనే పనులు
చెన్నూర్: చెన్నూర్ ఏరియా ఆసుపత్రి భవనం రెండేళ్ల క్రితం ప్రారంభించడంతో విద్యుత్ సరఫరా సక్రమంగా సాగుతోంది. ఏసీలు, ఇతర పరికరాల మరమ్మతు కోసం శాశ్వత ఎలక్ట్రీషియన్ లేకపోవడంతో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌ను సంప్రదించాల్సిన పరిస్థితి నెలకొంది. ఏసీలను మూడు నెలలకు ఒకసారి చెక్ చేయిస్తున్నామని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సత్యనారాయణ తెలిపారు.
బెల్లంపల్లిలో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు భేష్
బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు బేషుగ్గా ఉన్నాయి. షార్ట్‌సర్క్యూట్, ఇతర విద్యుత్ సమస్యలు ఉత్పన్నం కా కుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. మూడు నెలలకోసారి బెల్లంపల్లి అగ్నిమాపక సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. నాలుగు ఏసీలను షెడ్యూల్ ప్రకారం పరీక్షించాక ఆన్ చేస్తుండడం గమనార్హం.


